బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసులు
వారంలోగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరిక
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్నారు. సంజయ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అసత్య ఆరోపణలు చేసినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారాల్లో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. వారంలోపు క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
సంజయ్ వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయి. తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, రేవంత్‌తో కలిసిపోయానన్న వ్యాఖ్యలు నిరూపించాలని సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. కేంద్రమంత్రిగా ఉండి ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు.