Telugu Global
Telangana

హైదరాబాద్‌లో 'అమెజాన్ ఎయిర్'ను ప్రారంభించిన కేటీఆర్

"అమెజాన్ ఎయిర్‌ను ఉత్తర అమెరికా, యూరప్ వెలుపల ప్రారంభించడం ఇదే మొదటిసారి. భారతదేశంలో , అందులోనూ హైదరాబాద్ లో ఇది ప్రారంభించడం ఆనందంగా ఉంది." అని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ను ప్రారంభించిన కేటీఆర్
X

అమెజాన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో అమెజాన్ ఎయిర్‌ను ప్రారంభించడం భారతీయ ఇ-కామర్స్ పరిశ్రమలో గొప్ప క్షణమని అన్నారు.

సోమవారం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో అమెజాన్‌ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్‌ ఎయిర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెజాన్‌ బృందాన్ని అభినందించారు. అమెజాన్ పంపిణీ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి, వినియోగదారులకు వస్తువులను మరింత వేగంగా డెలివరీ చేయడానికి అమెజాన్ ఎయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

"అమెజాన్ ఎయిర్‌ను ఉత్తర అమెరికా, యూరప్ వెలుపల ప్రారంభించడం ఇదే మొదటిసారి. భారతదేశంలో , అందులోనూ హైదరాబాద్ లో ఇది ప్రారంభించడం ఆనందంగా ఉంది." అని కేటీఆర్ అన్నారు.

అమెజాన్ తన డైరెక్ట్ సెల్లర్స్ లిస్ట్‌లో మరింత మంది చేనేత కళాకారులను చేర్చుకోవాలని మంత్రి కోరారు.

ప్రస్తుతం, తెలంగాణ చేనేత శాఖతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 56 గ్రామాల్లో 4500 మంది నేత కార్మికులకు అమెజాన్ సహాయం చేస్తోంది.

ఏవియేషన్‌ రంగంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌ అని చెప్పారు. హైదరాబాద్‌ గ్రీన్‌సిటీ అవార్డును సొంతం చేసుకున్నదని తెలిపారు.


First Published:  23 Jan 2023 5:52 PM IST
Next Story