రేవంత్.. మరీ ఇంత సిగ్గులేని తనమా - కేటీఆర్
స్టాఫ్ నర్సులు, పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీ కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సైతం తన ట్వీట్‌కు యాడ్ చేశారు కేటీఆర్.
ఇటీవల తెలంగాణలో 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామకపత్రాలు అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాలను తమ ప్రభుత్వమే ఇచ్చిందంటూ ఇంద్రవెల్లిలో నిర్వహించిన తెలంగాణ పునర్‌నిర్మాణ సభలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. త్వరలోనే మరో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
అయితే రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒకరి క్రెడిట్‌ను కొట్టేయడం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదన్న కేటీఆర్.. ఇదే చివరిసారి కాదంటూ ట్వీట్ చేశారు. 6,956 స్టాఫ్ నర్సులు, 15 వేల 750 పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌ను కేసీఆర్ ప్రభుత్వమే పూర్తి చేసిందన్న విషయాన్ని ట్విట్టర్‌లో గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు ఎలక్షన్ కోడ్ కారణంగా ఫలితాలు విడుదల చేయలేకపోయామన్నారు. అయితే రిక్రూట్‌మెంట్‌తో ఏ మాత్రం సంబంధం లేని కాంగ్రెస్ మాత్రం తామే ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రజలను మోసం చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గు లేకుండా పోయిందంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా 7 వేల ఉద్యోగాల భర్తీ ఎలా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Not the first time, will not be the last time either for Credit Chor Congress party
— KTR (@KTRBRS) February 2, 2024
6,956 Staff Nurses and 15,750 Police constables recruitment was completed by KCR Govt but unfortunately we couldn’t release the results because of Election Code
Now the Congress Government which… https://t.co/veKgzR14fE pic.twitter.com/oo3IUZRSOn
స్టాఫ్ నర్సులు, పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీ కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సైతం తన ట్వీట్‌కు యాడ్ చేశారు కేటీఆర్. 2022 డిసెంబర్ 30న స్టాఫ్ నర్సుల ఉద్యోగాల కోసం కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2023 ఆగస్టు 2న కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామ్ నిర్వహించింది. 2023 ఆగస్టు 7న కీ రిలీజ్ చేసింది. 2023 అక్టోబర్ 9న ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఫలితాలు రిలీజ్ చేయలేకపోయింది. అయితే జనవరి 31న 6,956 మంది స్టాఫ్‌నర్సులకు నియామక పత్రాలు అందజేసిన రేవంత్ రెడ్డి.. తమ ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. ఇక పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ సైతం గత ప్రభుత్వమే పూర్తి చేసింది. కోర్టులో కేసుల వలన రిక్రూట్‌మెంట్ నిలిచిపోయింది.