Telugu Global
Telangana

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సాధారణంగా ఎవరికీ హామీలు ఇవ్వరు. ప్రభుత్వ పరంగా చేపట్టే పనులను అమలు చేస్తామనో, పథకాలు వర్తింపజేస్తామనో చెబుతుంటారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
X

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సాధారణంగా ఎవరికీ హామీలు ఇవ్వరు. ప్రభుత్వ పరంగా చేపట్టే పనులను అమలు చేస్తామనో, పథకాలు వర్తింపజేస్తామనో చెబుతుంటారు. ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖలకు సంబంధించిన పనులు చేయిస్తానని సమావేశాలు, మీడియాలోచెప్తుంటారు. అంతే కానీ అంత తర్వగా ఎవరికీ ఫలానా పోస్టు ఇస్తానని మాత్రం హామీ ఇవ్వడం కనపడదు. ఒక వేళ ఇస్తే మాత్రం తప్పకుండా ఆ మాటపై నిలబడతారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తుంటాయి. అయితే ఐదేళ్ల క్రితం ఓ నాయకుడికి ఇచ్చిన హామీని పార్టీ వర్గాలు కూడా మర్చిపోయాయి. కానీ కేటీఆర్ గుర్తుంచుకొని మరీ ఇప్పుడు నెరవేర్చడం టీఆర్ఎస్ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గూడూరి ప్రవీణ్‌ను తెలంగాణ రాష్ట్ర పవర్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. ప్రవీణ్‌కు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని కేటీఆర్ ఐదేళ్ల క్రితం హామీ ఇచ్చారు. తాజాగా ఆ హామీని నెరవేర్చడం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పద్మశాలీ సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుంది. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో కూడా ఈ సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువ. కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలవడంలో ఆ సామాజిక వర్గం ఓట్లు మాత్రమే కాకుండా.. గూడూరి ప్రవీణ్ కూడా కీలకంగా వ్యవహరించారు. ఆ అభిమానంతోనే ఓ మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.

30 ఏళ్లుగా గూడూరి ప్రవీణ్ రాజకీయాల్లో ఉంటున్నా.. అతడికి పెద్ద పదవులు వచ్చిన దాఖలాలు లేవు. అతడిని స్థానికంగా రాజకీయ దురదృష్టవంతుడు అంటుంటారు. ఈ విషయం తెలుసుకునే.. ఏదో ఒక రోజు రాష్ట్రస్థాయి పదవిలో గూడూరి ఉంటారని కేటీఆర్ చెప్పారు. ఇంత కాలం సిరిసిల్ల వరకే పరిమితం అయిన ప్రవీణ్.. ఈ పదవితో రాష్ట్ర స్థాయి నేత అనిపించుకోనున్నారు. వాస్తవానికి మూడు నెలల క్రితమే సెస్ చైర్మన్‌గా నియమించారు. కానీ కోర్టు ఆర్డర్‌తో ఆ పదవి రద్దైంది. ఈ విషయంలో ప్రవీణ్ చాలా కుంగిపోయారు. తనకు రాష్ట్ర స్థాయిలో పదవి ఇక రాదేమో అని బాధపడ్డారు. కానీ అనూహ్యంగా పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆయనను వరించింది.

గతంలో సిరిసిల్ల అర్బన్ బ్యాంకు చైర్మన్‌గా పని చేసిన ప్రవీణ్‌.. ఇప్పుడు మరోసారి పెద్ద సంస్థకు చైర్మన్‌గా పని చేయనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలీ వర్గానికి చెందిన ప్రముఖులు కూడా మంత్రికి, గూడూరు ప్రవీణ్‌కు అభినందనలు తెలిపారు.

First Published:  13 Sept 2022 6:36 PM IST
Next Story