చిచ్చా.. ఎట్లున్నవ్
మాజీ మంత్రి పద్మారావుగౌడ్ ను పరామర్శించిన కేటీఆర్, కవిత
చిచ్చా.. ఎట్లున్నావని మాజీ మంత్రి పద్మారావుగౌడ్ ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఉత్తరఖండ్‌లోని డెహ్రాడూన్ పర్యటనకు వెళ్లిన పద్మారావు గౌడ్ స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటు వచ్చినట్టుగా నిర్దారించి స్టంట్ వేసి కాసేపటి తర్వాత డిశ్చార్జ్ చేశారు. బుధవారం డెహ్రాడూన్ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న కేటీఆర్, కవిత పద్మారావు గౌడ్ నివాసానికి చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఆయనకు జరిగిన యాంజియోప్లాస్టీ సర్జరీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇప్పుడప్పుడే ప్రజల్లోకి వెళ్లి గంటలు గంటలు వాళ్లతోనే ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుందని జాగ్రత్తలు చెప్పారు. వారి వెంట మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, నాయకులు దాసోజు శ్రవణ్ తదితరులు ఉన్నారు.