Telugu Global
Telangana

ఇద్దరు అభ్యర్థులపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

వారిద్దరూ లోక్ సభ అభ్యర్థులుగా బీఆర్ఎస్ తరపున పోటీలో నిలుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు కేటీఆర్. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ వేశారు.

ఇద్దరు అభ్యర్థులపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
X

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరికీ ఒక ఉమ్మడి ప్రత్యేకత ఉంది. వారిద్దరూ గతంలో సివిల్ సర్వెంట్లు కావడం విశేషం. ఒకరు మాజీ ఐఏఎస్ అయితే, మరొకరు మాజీ ఐపీఎస్ అధికారి. అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ప్రాధాన్యాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు ఇది తాజా ఉదాహరణ అంటున్నారు కేటీఆర్. ఉన్నతోద్యోగులుగా పనిచేసిన వారిద్దరూ చట్టసభల్లో మరింత మెరుగైన పాలనకోసం కృషి చేస్తారని, తెలంగాణ ప్రజలు వారిని గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తారనే నమ్మకం తనకు ఉందని ట్వీట్ చేశారు.


నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డికి లోక్ సభ స్థానాలు ఖరారు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరూ మాజీ సివిల్ సర్వెంట్లు కావడం ఇక్కడ విశేషం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ కాగా, వెంకట్రామిరెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి. వారిద్దరూ లోక్ సభ అభ్యర్థులుగా బీఆర్ఎస్ తరపున పోటీలో నిలుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు కేటీఆర్. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ వేశారు. ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు పార్టీ అధినేత కేసీఆర్ కి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

కేసీఆర్ వ్యూహం ఫలించేనా..?

ఒక్కొక్కరే సిట్టింగ్ ఎంపీలు చేజారుతున్నా కేసీఆర్ లోక్ సభ అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఓ దశలో బీఎస్పీతో పొత్తు పెట్టుకుని రెండు స్థానాలు కేటాయించాలనుకున్నా, అది సాధ్యం కాకపోవడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్, మెదక్ కి పోటీ పడుతున్న మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులిద్దరూ ఆయా స్థానాల్లో గట్టిపోటీ ఇవ్వబోతున్నారు. ఒకరకంగా ప్రత్యర్థులను ముందుగానే మానసికంగా దెబ్బకొట్టారు కేసీఆర్.

First Published:  23 March 2024 12:31 PM IST
Next Story