Telugu Global
Telangana

ఆ విషయంలో విఫలమయ్యాం, అందుకే ఓటమి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ హయాంలో వందలాది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా ఏనాడూ ప్రజలను క్యూలైన్లలో నిలబెట్టలేదన్నారు కేటీఆర్. ప్రజల సౌకర్యం చూశామే కానీ, రాజకీయ ప్రయోజనం, ప్రచారం గురించి ఆలోచించలేదన్నారు.

ఆ విషయంలో విఫలమయ్యాం, అందుకే ఓటమి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని, అందుకే ఇష్టారీతిన హామీలిచ్చారని, ఆ హామీలు, వారు చేసిన తప్పుడు ప్రచారమే చివరకు వారిని గెలిపించాయని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. చేసిన పనుల్ని చెప్పుకోవడంలో తాము విఫలమయ్యామని, కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని చెప్పారు. పనులకంటే, ప్రచారం మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఉంటే గెలిచేవాళ్లమని అన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుతో పాటు పోడు పట్టాల పంపిణీ సహా అనేక పథకాలు అమలు చేసినా.. గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో కూడా ఓటమి తప్పలేదని అన్నారు కేటీఆర్. ఆయా అంశాలపై ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. బీఆర్ఎస్ లో గొప్పగా పనిచేసిన వారిని సైతం ప్రజలు ఆదరించలేదని, ఇదంతా కాంగ్రెస్ తప్పుడు ప్రచార ఫలితమేనని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తగా ఇవ్వలేదని ప్రత్యర్థులు విమర్శలు చేశారని.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొమ్మిదిన్నరేళ్లలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు కేటీఆర్. దేశంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తామేనని, 73 శాతం జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. 29 లక్షల పెన్షన్లను 46 లక్షలకు పెంచామని అన్నారు. ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోలేకపోవడం వల్లే ఓటమిపాలయ్యామన్నారు కేటీఆర్.

ఇవెక్కడి క్యూలైన్లు..

బీఆర్ఎస్ హయాంలో వందలాది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా ఏనాడూ ప్రజలను క్యూలైన్లలో నిలబెట్టలేదన్నారు కేటీఆర్. ప్రజల సౌకర్యం చూశామే కానీ, రాజకీయ ప్రయోజనం, ప్రచారం గురించి ఆలోచించలేదన్నారు. ఇప్పుడు ప్రజల్ని పథకాలకోసం క్యూలైన్లలో నిలబెడుతున్నారని, ప్రజా ప్రయోజనం కంటే కాంగ్రెస్ ప్రచారమే ఎక్కువగా ఉందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తమను పూర్తిగా తిరస్కరించలేదన్న ఆయన.. తమ పార్టీకి మూడొంతుల సీట్లు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం పార్టీని మరింత బలోపేతం చేసి లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు కేటీఆర్. ఇకపై వరుస సమావేశాలు నిర్వహించి.. అనుబంధ సంఘాలను కూడా బలోపేతం చేస్తామన్నారు.

First Published:  11 Jan 2024 2:01 PM GMT
Next Story