Telugu Global
Telangana

బీఆర్ఎస్ కి 10 ఎంపీ సీట్లివ్వండి.. ఆ తర్వాత

బీఆర్ఎస్ కి లోక్ సభ ఎన్నికల్లో పట్టం కడితే కాంగ్రెస్ పై ఒత్తిడి పెరుగుతుందన్నారు కేటీఆర్. ఏడాదిలోపు తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు వస్తుందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ కి 10 ఎంపీ సీట్లివ్వండి.. ఆ తర్వాత
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 10 లేదా 12 సీట్లు ఇస్తే ఏడాది లోపు తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ వచ్చాక తెలంగాణ పరిస్థితి దారుణంగా తయారైందని, కరెంటు లేదని, నీళ్లు లేవని బాధపడుతున్న ప్రజలు.. బీఆర్ఎస్ కి అండగా నిలవాలన్నారు. బీఆర్ఎస్ కి లోక్ సభ ఎన్నికల్లో పట్టం కడితేనే కాంగ్రెస్ పై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఏడాదిలోపు తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు వస్తుందని స్పష్టం చేశారు కేటీఆర్.


దురదృష్టవశాత్తు అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లలోనే గెలిచామని, 14 సీట్లలో వెయ్యి, రెండు, నాలుగు వేల తేడాతో ఓడిపోయామని, ఆ 14 సీట్లు గెలిచి ఉంటే కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయిఉండేవారన్నారు కేటీఆర్. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ని చిత్తు చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ కి పట్టంకడితే.. మనకు భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఆలంపూర్‌ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. లోక్ సభ ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

మొగోడివైతే ఒక్క సీటు గెలవాలని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారని, ఆయన భాషలోనే తాను అడుగుతున్నానని.. రేవంత్ మొగోడు అయితే రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపెట్టాలని, 1.67కోట్ల మంది ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. మొగోడివైతే 46 లక్షల మందికి ఆసరా పెన్షన్ ఇచ్చి మాట్లాడు రేవంత్.. అని సవాల్ విసిరారు కేటీఆర్.

First Published:  24 April 2024 7:57 AM IST
Next Story