Telugu Global
Telangana

తప్పు రేవంత్ రెడ్డిది కాదు, మనదే..! కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

రైతులు కర్రు కాల్చి వాత పెడతారన్న భయంతోనే రేవంత్ రెడ్డి కొత్త వాయిదా పెట్టారని అన్నారు కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్ చేసిన, చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించటమే మన పని అని అన్నారు.

తప్పు రేవంత్ రెడ్డిది కాదు, మనదే..! కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

తెలంగాణలో మళ్లీ పాత రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పి మరీ మోసం చేశారన్నారు. తప్పు రేవంత్ రెడ్డిది కాదు, మనదేనన్నారు. మనం చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పుకోవటంలో విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. మన మీద జరిగిన విష ప్రచారాన్ని సరిగ్గా తిప్పికొట్టలేకపోయామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆ తప్పులు చేయొద్దని.. కాంగ్రెస్, బీజేపీ మీద ప్రజలు మంట మీద ఉన్నారని, కష్టపడి పనిచేస్తే ఆదిలాబాద్ గెలవటం పక్కా అని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ చేసిన, చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించటమే మన పని అని అన్నారు కేటీఆర్.


ఆత్రం సక్కుకి ఇచ్చిన మాట ప్రకారం 4 నెలల క్రితమే ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఆయన్ను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారని చెప్పారు కేటీఆర్. అధికారం పోగానే కొంతమంది వేరే దారులు వెతుకుతున్నా.. ఆత్రం సక్కు మాత్రం ఏ ప్రలోభాలకు లొంగలేదని చెప్పారు. ఆయన విలువలతో కూడిన వ్యక్తి అని, కష్టకాలంలో కూడా పార్టీతోనే ఉన్న నిజాయితీ గల వ్యక్తి అని వివరించారు.

అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు కేటీఆర్. రుణమాఫీ, రైతు భరోసా, ఇంట్లో ఇద్దరు ముసలోళ్లు ఉంటే ఇద్దరికీ రూ.4 వేలు పెన్షన్ ఇస్తానంటూ డైలాగులు కొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు చప్పుడు చేయడం లేదన్నారు. డిసెంబర్ 9న ప్రమాణం స్వీకారం అని చెప్పి డిసెంబర్ 7నే కుర్చీలో కూర్చున్నారని, అధికారం రెండు రోజుల ముందే తీసుకున్న రేవంత్ రెడ్డి.. రుణమాఫీ మాత్రం 4 నెలలైనా చేయలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ.. అంటూ కొత్త పాట పాడుతున్నారని విమర్శించారు. రైతులు కర్రు కాల్చి వాత పెడతారన్న భయంతోనే రేవంత్ రెడ్డి కొత్త వాయిదా పెట్టారని అన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిందేనన్నారు. లేదంటే రేవంత్ రెడ్డి ఉన్న అన్ని పథకాలను రద్దు చేస్తారన్నారు కేటీఆర్.

First Published:  16 April 2024 8:31 PM IST
Next Story