అవ్వాతాతలకు శుభవార్త.. ఆసరా పెన్షన్లపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
మొత్తమ్మీద ఆసరా పెన్షన్ల విషయంలో బీఆర్ఎస్ హామీ ఏదో గట్టిగా ఉండేలా కనపడుతోంది. బీఆర్ఎస్ మేనిఫెస్టో బయటకు వస్తే.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుందేమో చూడాలి.
తెలంగాణ ఎన్నికల్లో సామాజిక పెన్షన్ల పెంపు వ్యవహారం కీలకంగా మారే అవకాశముంది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో పెన్షన్ల పెంపు కూడా ఉంది. నెలకు 4వేల రూపాయల పెన్షన్ ఇస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు లేవు కదా.. మరి తెలంగాణలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. అలవికాని హామీలతో కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఇదే విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ప్రజలకు హామీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆసరా పెన్షన్ల పెంపుపై త్వరలో సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారని అన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి కేవలం హామీతోనే సరిపెట్టింది. అధికార బీఆర్ఎస్ పెన్షన్లు పెంచి చూపించబోతోంది. అదే జరిగితే.. కాంగ్రెస్ 4వేల రూపాయల పెన్షన్ హామీని ప్రజలు పట్టించుకునే అవకాశం ఉండదు.
వరంగల్ లో పర్యటనలో ఆసరా పెన్షన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. త్వరలో అవ్వాతాతలకు శుభవార్త చెబుతామన్నారు. 1956 నుంచి కాంగ్రెస్, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీ తెలంగాణపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణపై ప్రేమ లేదన్నారు. బీఆర్ఎస్ గట్టున రైతుబంధు ఉంటే.. ఆ గట్టున రాబందులున్నారని.. ఎవరికి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
మొత్తమ్మీద ఆసరా పెన్షన్ల విషయంలో బీఆర్ఎస్ హామీ ఏదో గట్టిగా ఉండేలా కనపడుతోంది. బీఆర్ఎస్ మేనిఫెస్టో ఆకట్టుకునేవిధంగా ఉంటుందని అంటున్నారు నేతలు. మహిళలకు శుభవార్తలుంటాయని మంత్రి హరీష్ రావు ఊరిస్తున్నారు. తాజాగా ఆసరా పెన్షన్ల విషయంలో గుడ్ న్యూస్ వింటారని చెప్పారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ మేనిఫెస్టో బయటకు వస్తే.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుందేమో చూడాలి.