Telugu Global
Telangana

హైదరాబాద్‌లో 'బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్' క్యాంపస్ నుప్రారంభించిన మంత్రి కేటీఆర్

బాష్ స్మార్ట్ క్యాంప‌స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ వ్యవస్థలో EV తయారీదారులు, బ్యాటర్ తయారీదారులు, రీసైక్లర్లు తదితర బహుళ వాటాదారులు ఉంటారని మంత్రి తెలిపారు.

హైదరాబాద్‌లో బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ క్యాంపస్ నుప్రారంభించిన   మంత్రి కేటీఆర్
X

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ స్మార్ట్ క్యాంపస్ ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3,000 మంది ఉద్యోగులు పనిచేయనున్న ఈ కంపెనీలో ప్రస్తుతం 1,400 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది కృత్రిమ మేధస్సు, ఇ-మొబిలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, భద్రత, తదితర అంశాలపై దృష్టి పెడుతుంది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ వ్యవస్థలో EV తయారీదారులు, బ్యాటర్ తయారీదారులు, రీసైక్లర్లు తదితర బహుళ వాటాదారులు ఉంటారని మంత్రి తెలిపారు. ఇది ఇంజనీరింగ్, బ్యాటరీ టెస్టింగ్, తయారీ, ఆవిష్కరణ జోన్‌లను కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతమిచ్చే ప్రయత్నాల్లో భాగంగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో హైదరాబాద్ తన మొట్టమొదటి ఫార్ములా ఇ రేసును నిర్వహించనుంది. EV వాటాదారులను ఏకతాటిపైకి తీసుకురావడానికి హైదరాబాద్‌లో EV వీక్, EV సమ్మిట్‌లను నిర్వహించేందుకు రాష్ట్రం ప్రణాళికలను రూపొందించిందని ఆయన చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వ విధానాలను చూసి, ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌లో సుమారు రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు.

తెలంగాణ గత ఎనిమిదేళ్లలో అనేక పెట్టుబడులను ఆకర్షించింది. ZF, Fisker, Stellantis, Hyundai, Uber, Qualcomm, Amazon, Apple వంటి అనేక‌ కంపెనీలు హైదరాబాద్‌లో భారీ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. అనేక పెద్ద కంపెనీలు హైదరాబాద్‌లో అతిపెద్ద క్యాంపస్‌లను కూడా కలిగి ఉన్నాయి. మహీంద్రా, మైత్రా, రేస్‌ఎనర్జీ వంటి స్వదేశీ కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. దాదాపు 400 మంది ఉద్యోగులతో దశాబ్దం క్రితం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన‌ నోవార్టిస్ ఇప్పుడు 9,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తోందన్నారు కేటీఆర్.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు రూ.57,000 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు ప్రస్తుతం రూ.1.83 లక్షల కోట్లు దాటాయని, దేశ మొత్తం 4,50,000 ఉద్యోగాలు కల్పించగా అందులో తెలంగాణ 1,50,000 ఉద్యోగాలు కల్పించిందని, గత ఏడాది దేశంలోని ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ రాష్ట్రం ఒక ఉద్యోగాన్ని సృష్టించిందని కేటీఆర్ చెప్పారు.

హైదరాబాద్‌లో ఈ రోజు ప్రారంభమైన ఈ కొత్త క్యాంపస్ సాఫ్ట్‌వేర్ సెంట్రిక్ ఇన్నోవేషన్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో పనిచేస్తుందని బోష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ సెంటర్ హెడ్ - హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ సుందర రామన్ అన్నారు.

''ఇప్పటికే హైదరాబాద్‌లో సుమారు 1,500 మంది ఉద్యోగుల‌తో రెండు సెంటర్ లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇప్పుడు ఈ కొత్త క్యాంపస్ కార్యకలాపాలను ఏకీకృతం చేస్తుంది. ఆటోమోటివ్ ఇంజినీరింగ్, డిజిటల్ ఎంటర్‌ప్రైజ్‌లో వర్క్‌ఫోర్స్ ప్రతిభను పెంపొందించడానికి ఈ కొత్త సెంటర్ కృషి చేస్తుంది'' అని ఆయన చెప్పారు.


First Published:  14 Dec 2022 5:14 PM IST
Next Story