Telugu Global
Telangana

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఉహించుకోండి

కార్యకర్తలు ఉదాసీన వైఖరి, మీమాంస వీడాలన్నారు కేటీఆర్. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు..? ఇపుడేం చేస్తున్నారనే విషయాలను ప్రజలకు విడమరచి చెప్పాలన్నారు.

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఉహించుకోండి
X

"మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టక ముందే కాంగ్రెస్ వాళ్ళు ఉలికి పడుతున్నారు, రేపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఉహించుకోండి" అని నల్గొండ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని చెప్పారు. కార్యకర్తల వల్లే ఇన్నేళ్ళుగా పార్టీ బలంగా ఉందని, లోక్ సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. నల్గొండ జిల్లాలో అన్నీ అనుకూలంగానే ఉన్నాయని, ఓటమిపై ఎక్కడా అనుమానం లేకపోయినా చివరికి ఫలితాలు మరోలా వచ్చాయని చెప్పారు కేటీఆర్.


పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు కేటీఆర్. ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని, సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని మనం గట్టిగా తిప్పికొట్టలేకపోయామని వివరించారు. ప్రత్యర్థులు అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగన లేదని, అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారన్నారు. ఆ హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టె ప్రయత్నం చేస్తోందన్నారు.

కార్యకర్తలూ.. బీ అలర్ట్

కార్యకర్తలు ఉదాసీన వైఖరి, మీమాంస వీడాలన్నారు కేటీఆర్. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు..? ఇపుడేం చేస్తున్నారనే విషయాలను ప్రజలకు విడమరచి చెప్పాలన్నారు. కోమటి రెడ్డి గత నవంబర్ లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారని, నల్గొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి రెడ్డికే పంపాలన్నారు. సాగర్ ఆయకట్టు కు కాంగ్రెస్ పాలన లో మొదటి సారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించిందన్నారు కేటీఆర్. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోందని మండిపడ్డారు. కేసీఆర్ పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని.. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలని కార్యకర్తలకు స్పష్టం చేశారు కేటీఆర్.

First Published:  23 Jan 2024 8:24 AM IST
Next Story