Telugu Global
Telangana

ఇది ప్రజా పాలన కాదు.. గలీజు పాలన

జలమే జగతికి మూలం అనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తించాలని, నీటి నిర్వహణ సరిగా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు కేటీఆర్.

ఇది ప్రజా పాలన కాదు.. గలీజు పాలన
X

తెలంగాణలో జరుగుతోంది ప్రజాపాలన కాదని, గలీజు పాలన అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన ఇదని విమర్శించారాయన. సర్కారు తీరు మారకపోతే ప్రజలే కాంగ్రెస్ ని తరిమికొట్టడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో వరుసగా జరుగుతున్న దుర్ఘటనలను ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీస స్పందన లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు కేటీఆర్.


కోతల్లేని కరెంట్ ఇవ్వలేరని, కనీసం కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు కేటీఆర్. కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోవట్లేదని అన్నారు. నల్గొండలోని వాటర్ ట్యాంకులో 10రోజులుగా శవం ఉన్నా నిద్రలేవని సర్కారు ఇదన్నారు. సాగర్ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే, కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం అదే నిర్లిప్తత కనపడుతోందన్నారు. సురక్షిత మంచి నీళ్లు కూడా ఇవ్వలేని కాంగ్రెస్ సర్కారు, ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసి గలీజు పాలన కొనసాగిస్తోందన్నారు కేటీఆర్.

బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ పథకంతో దశాబ్దాల తాగునీటి తండ్లాట తొలగిపోయిందని గుర్తు చేశారు కేటీఆర్. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం వాటర్ ట్యాంకుల నిర్వహణ కూడా చేతకాక అసమర్థ ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందన్నారు. జలమే జగతికి మూలం అనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తించాలని, నీటి నిర్వహణ సరిగా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు కేటీఆర్.

First Published:  4 Jun 2024 6:18 AM IST
Next Story