Telugu Global
Telangana

ప్రదీప్ కి కేటీఆర్ 'మాట'సాయం

మేడ్చల్ నియోజకవర్గం కృతజ్ఞతా సభ అనంతరం.. మల్లారెడ్డితో కలిసి ఘట్‌కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీలోని ప్రదీప్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ప్రదీప్ కి కేటీఆర్ మాటసాయం
X

ఆ పిల్లవాడి పేరు ప్రదీప్. పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది, మాటలు కూడా రావు. ఏదయినా సైగలతోనే చెబుతాడు. అలాంటి పిల్లవాడు ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని చూసి సంబరపడిపోయాడు. తనకు ఆపరేషన్ జరుగుతుందని, ఇకపై తాను మాట్లాడగలుగుతానని సంతోషపడ్డాడు. తమ ఇంటికి తరలి వచ్చిన నాయకులను చూసి ప్రదీప్ కుటుంబం ఆశ్చర్యానికి గురైంది.


ఘట్‌కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీకి చెందిన బాలుడు ప్రదీప్. చిన్నప్పుడు అందరి పిల్లల్లాగే హుషారుగా ఉండే ప్రదీప్ ని చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. కానీ ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యే సమయంలో వినికిడి లోపం బయటపడింది. మాట కూడా రాకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఒకసారి ఆపరేషన్ చేయించారు కానీ ఫలితం లేదు. మరోసారి ఆపరేషన్ కోసం సిద్ధమయ్యారు. కానీ డబ్బులు సరిపోలేదు. అప్పటి మంత్రి మల్లారెడ్డి ఈఎస్ఐ ద్వారా కొంత సాయం చేశారు. అయితే మిగిలిన డబ్బులు సమకూర్చుకోలేక తల్లిదండ్రులు.. దాతలకోసం ఎదురు చూస్తున్నారు. స్థానిక నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆ పిల్లవాడికి తాను అండగా నిలబడతానన్నారు. ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

తానే స్వయంగా ఆ పిల్లవాడి ఇంటికి వెళ్లి సాయం చేశారు కేటీఆర్. మేడ్చల్ నియోజకవర్గం కృతజ్ఞతా సభ అనంతరం.. మల్లారెడ్డితో కలిసి ఘట్‌కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీలోని ప్రదీప్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. నాయకులంతా తమ ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ ని, మల్లారెడ్డిని తమ జీవితాంతం గుర్తుంచుకుంటామని కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  2 Feb 2024 6:22 PM IST
Next Story