కేటీఆర్, హరీష్.. వారసుడెవరో చెప్పిన కేసీఆర్
అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుని నిలబెట్టుకున్న వాళ్లు కచ్చితంగా నిలబడతారన్నారు కేసీఆర్. తాను ఎవరినీ ప్రత్యేకంగా ప్రోత్సహించలేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి వారసుడెవరు.. హరీష్ రావా, కేటీఆరా..! ఇది సామాన్యంగా తెలంగాణ ప్రజలందరి మదిలో మెదిలే ప్రశ్న. అయితే తాజాగా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. టీవీ-9 బిగ్ డిబేట్‌లో పాల్గొన్న కేసీఆర్.. రజినీకాంత్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.
కేటీఆర్, హరీష్ రావు.. కేసీఆర్ ఏమన్నారంటే..!
వారసులను నిర్ణయించే అధికారం ఎవరికీ ఉండదన్నారు. సమయం, సందర్భాన్ని బట్టి నాయకత్వం తయారవుతుందన్నారు. తయారు చేస్తే నాయకులు కాలేరన్నారు. తాను ఎవరినీ నాయకులుగా తయారు చేయలేదని.. ప్రాసెస్‌లో వచ్చి చాలా మంది నాయకులుగా ఎదిగారని చెప్పారు.
హరీష్ రావు, కేటీఆర్‌లకు తాను ఒకసారి సీటు ఇచ్చానని.. తర్వాత వాళ్ల ప్రతిభతో, ప్రజలతో మమేకమై ఎదిగారన్నారు. హరీష్ రావు దాదాపు 6 నుంచి 7 సార్లు, కేటీఆర్ దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారని చెప్పారు. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుని నిలబెట్టుకున్న వాళ్లు కచ్చితంగా నిలబడతారన్నారు కేసీఆర్. తాను ఎవరినీ ప్రత్యేకంగా ప్రోత్సహించలేదన్నారు. ప్రజల నుంచి, పార్టీ నాయకుల నుంచి వచ్చినప్పుడే అది శాశ్వతంగా నిలబడుతుందన్నారు. బలవంతంగా రుద్దితే ఎక్కువకాలం నిలబడదన్నారు.