Telugu Global
Telangana

అమెరికాకు బయలుదేరిన కేటీఆర్.. ఎందుకంటే..?

కేటీఆర్ అమెరికా పర్యటన వ్యక్తిగతమే అయినా, ఆ తర్వాత ఆయన అధికారిక పర్యటన కోసం రష్యా వెళ్తారు. "ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌ పోర్టల్‌" సదస్సులో ఆయన పాల్గొంటారు.

అమెరికాకు బయలుదేరిన కేటీఆర్.. ఎందుకంటే..?
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాకు బయలుదేరారు. కొడుకు హిమాన్షుతో కొంత సమయం గడిపేందుకు ఆయన అమెరికా వెళ్తున్నట్టు తెలుస్తోంది. "Off to the United States.. Dad duty beckons" అంటూ కేటీఆర్ ట్వీట్ వేయడంతో ఆయన అమెరికా పర్యటన విజయవంతం కావాలని అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. మీకోసం మేం ఇక్కడ వేచి చూస్తున్నామంటూ అమెరికాలోని కొందరు అభిమానులు ఆయనకు ఆహ్వానం పలికారు. కేటీఆర్ తనయుడు హిమాన్షు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు.


అమెరికా తర్వాత రష్యా..

కేటీఆర్ అమెరికా పర్యటన వ్యక్తిగతమే అయినా, ఆ తర్వాత ఆయన అధికారిక పర్యటన కోసం రష్యా వెళ్తారు. సెప్టెంబర్ 5 నుంచి 7వతేదీ వరకు రష్యాలోని మాస్కో లో "ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌ పోర్టల్‌ 2030-2050" సదస్సు జరుగుతుంది. "స్కోల్‌కోవో" సంస్థ ఈ సదస్సు నిర్వహిస్తుంది. ఈ సదస్సులో పాల్గొనాలని కోరుతూ కేటీఆర్ కి ఆహ్వానం పంపించారు నిర్వాహకులు. ‘ఫ్యూచరిస్టిక్‌’ అనే అంశంపై ఈ సదస్సులో కేటీఆర్ ప్రసంగిస్తారు. భవిష్యత్తు అవకాశాలు, వాటిని వినియోగించుకునే విధానాలపై ఆయన తన సందేశం వినిపిస్తారు.

తెలంగాణలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే విషయంలో కేటీఆర్‌ చేసిన కృషి అద్భుతమని ఆహ్వాన పత్రికలో "స్కోల్‌కోవో" ఫౌండేషన్‌ నిర్వాహకులు అభినందించారు. ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కేటీఆర్ కి ఉన్న అనుభవాన్ని తమతో పంచుకునేందుకు ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు ఆ సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధనా రంగంలోని విద్యార్థులు, ఇతర రంగానికి చెందిన ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకు రాబోతున్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన అవకాశాలను సృష్టించడంపై వీరంతా చర్చిస్తారు. టెక్నాలజీ, ఆర్థికరంగంలో ఉన్నత అవకాశాలు కల్పించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

First Published:  29 Aug 2024 3:07 AM GMT
Next Story