Telugu Global
Telangana

బీజేపీలో BRS విలీనం వార్తలు.. కేటీఆర్ సీరియస్‌ వార్నింగ్

తప్పుడు వార్తలకు ఖండన ప్రచురించాలని, లేదంటే చట్టపరంగా చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ సేవలందిస్తోందన్న కేటీఆర్.. నిరాధారమైన ప్రచారాన్ని ఆపాలని కోరారు.

బీజేపీలో BRS విలీనం వార్తలు.. కేటీఆర్ సీరియస్‌ వార్నింగ్
X

బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పందం కుదిరిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియ‌స్‌గా స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఎంతో మంది వ్యతిరేకులను, ఎన్నో వ్యతిరేక ప్రచారాలను తట్టుకుని 24 ఏళ్లుగా నిలబడ్డామన్నారు. అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి, దేశానికే గర్వకారణంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. ఇతరులు కూడా తెలంగాణ మోడల్‌ అనుసరించే స్థాయికి చేరుకున్నామన్నారు.


బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ వార్తలు ప్రచారం చేస్తున్న వారికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. కుట్రతో నిరాధారమైన పుకార్లను వ్యాప్తి చేసే వారికి ఇదే చివరి వార్నింగ్ అన్నారు. తప్పుడు వార్తలకు ఖండన ప్రచురించాలని, లేదంటే చట్టపరంగా చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ సేవలందిస్తోందన్న కేటీఆర్.. నిరాధారమైన ప్రచారాన్ని ఆపాలని కోరారు. పడిపోతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతం.. ఎన్నటికీ తలవంచం.. ఇప్పుడు కాదు ఎప్పటికీ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. జై తెలంగాణ అంటూ తన ట్వీట్ ముగించారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో బాగా నష్టపోయిందని, దీంతో త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతుందంటూ Rtv రవి ప్రకాష్‌ వార్తలు ప్రసారం చేశారు. వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం జరగబోతుందంటూ బిగ్ బ్రేకింగ్ న్యూస్ పేరిట ప్రసారం చేశారు. ఇప్పటికే విలీనానికి సంబంధించి చర్చలు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. ఈ వార్తలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి.

First Published:  7 Aug 2024 11:58 AM GMT
Next Story