ఇథనాల్ పరిశ్రమకు అనుమతులిచ్చిందే కేటీఆర్
ఆయనకు చిత్తశుద్ధి ఉంటే దిలావర్‌పూర్‌కు రావాలని, కంపెనీకి అనుమతులు ఎవరు ఇచ్చారన్నది అక్కడ తేలుద్దామని సీతక్క సవాల్
దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమకు అన్ని అనుమతులు కేసీఆర్, కేటీఆరే ఇచ్చారని మంత్రి సీతక్క ఆరోపించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అనుమతులు ఇచ్చే సమయానికి ఇథనాల్ కంపెనీ డైరెక్టర్‌గా తలసాని సాయి ఉన్నారు. ఆ కంపెనీ మరో డైరెక్టర్‌గా పుట్టా సుధాకర్ కుమారుడు ఉన్నారని చెప్పారు. పుట్టా సుధాకర్, తలసాని శ్రీనివాస్ వియ్యంకులని సీతక్క వెల్లడించారు. గతంలో గ్రామసభ నిర్వహించకుండానే అనుమతులు ఇచ్చారు. తప్పుచేసి విధ్వంసాలు సృష్టిస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు? ఆయనకు చిత్తశుద్ధి ఉంటే దిలావర్‌పూర్‌కు రావాలని, కంపెనీకి అనుమతులు ఎవరు ఇచ్చారన్నది అక్కడ తేలుద్దామని సీతక్క సవాల్ విసిరారు. ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి వెళ్దామన్నారు. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే దాన్ని మాకు ఆపాదించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ ఆ కంపెనీకి అనుమతులు ఇచ్చింది బీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వమే అన్నారు. కేటీఆర్ సంతకాలతో ఉన్న వివరాలను త్వరలోనే బయటపెడుతామన్నారు.
కుట్రదారులను బైటపెడుతాం
హాస్టళ్లలో వరుస ఘటనల వెనుక కుట్ర ఉన్నట్లు భావిస్తున్నామని సీతక్క అన్నారు. దీనిపై విచారణ జరిపి కుట్రదారులను బయటపెడతామని.. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అవసరమైతే అధికారులను సర్వీస్ నుంచి తొలిగిస్తామని మంత్రి హెచ్చరించారు.