కాంగ్రెస్‌కు వచ్చే స్థానాలు ఎన్నంటే.. - కేటీఆర్ చిట్‌చాట్
కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 30 మెడికల్ కాలేజీలు నిర్మించామన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తి అని.. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసినా ప్రజలు దీవిస్తారన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి దాదాపు 60 రోజులు పూర్తవుతుందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రచారంలోనూ ముందున్నాం.. ఎన్నికల ఫలితాల్లోనూ ముందుంటామని ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్‌చాట్ చేసిన కేటీఆర్.. కాంగ్రెస్‌కు 42 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని.. అలాంటిది 75 స్థానాల్లో అభ్యర్థులు ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ఈసారి బీఆర్ఎస్‌కు గతంలో వచ్చిన 88 స్థానాల కంటే ఎక్కువే వస్తాయన్నారు. కాంగ్రెస్ చోర్ పార్టీ.. కుంభకోణాల కుంభమేళా పార్టీగా అభివర్ణించారు.
యుద్ధానికి ముందే బీజేపీ చేతులెత్తేసిందన్నారు కేటీఆర్. 110 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు సైతం దక్కవన్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్‌లోనూ పోటీ చేయడంపై సెటైర్లు వేశారు కేటీఆర్. 119 స్థానాల్లో పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ఈసారి ఈటల హుజూరాబాద్‌లో ఓడిపోవడం ఖాయమన్నారు చెప్పారు. మజ్లిస్ మతతత్వ పార్టీ కాదన్నారు. మజ్లిస్‌తో ఎలాంటి పొత్తు లేదని.. కేవలం ఫ్రెండ్లీ పార్టీ మాత్రమేనన్నారు.
కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 30 మెడికల్ కాలేజీలు నిర్మించామన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తి అని.. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసినా ప్రజలు దీవిస్తారన్నారు. ముదిరాజ్‌లను కేసీఆర్ రాజ్యసభకు పంపారని.. మండలి డిప్యూటీ ఛైర్మన్ చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీ బానిసలన్న కేటీఆర్.. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని.. ఈ విషయంలో మరో మాటే లేదన్నారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు పిచ్చి ఆలోచనలు లేవన్నారు.
లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరిపినప్పటికీ.. లెక్కలు కుదర్లేదని చెప్పారు కేటీఆర్. పరోక్షంగా అవకాశాలు ఇస్తామని చెప్పినప్పటికీ.. లెఫ్ట్ పార్టీలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తామని పట్టుబట్టారన్నారు. లెఫ్ట్ పార్టీలకు బీజేపీపై పోరాడతామని మాట ఇచ్చామని.. ఇచ్చిన మాట ప్రకారం పోరాడుతున్నామని.. పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక కేసీఆర్ మొత్తం వంద నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని.. తానూ సిటీలోని నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తామని చెప్పారు.