Telugu Global
Telangana

సత్యనాదెళ్లతో బిజినెస్, బిర్యానీ గురించి మాట్లాడా..

తెలంగాణలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల వృద్ధి, హైదరాబాద్‌ లో అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలను సత్యనాదెళ్లకు మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో వివరించినట్టు తెలుస్తోంది.

సత్యనాదెళ్లతో బిజినెస్, బిర్యానీ గురించి మాట్లాడా..
X

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ కి వచ్చారు. హైదరాబాద్ లో ఉన్న ఆయనతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కేటీఆర్. ‘‘ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఈ రోజును ప్రారంభించడం సంతోషంగా ఉంది.’’ అని ట్వీట్ చేశారు కేటీఆర్. సత్యనాదెళ్లతో తాను బిజినెస్, బిర్యానీ గురించి మాట్లాడానంటూ ఫన్నీ క్యాప్షన్ జతచేశారు.


అసలు సమావేశం ఇదీ..

తెలంగాణలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల వృద్ధి, హైదరాబాద్‌ లో అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలను సత్యనాదెళ్లకు మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో వివరించినట్టు తెలుస్తోంది. కొత్త సాంకేతికత, సమాచార మార్పిడిపై ఇద్దరూ చర్చించారు. హైదరాబాద్ లో ఐటీ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యంగా బెంగళూరుని మించిపోయేలా హైదరాబాద్ లో ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలిస్తూ ప్రభుత్వం సహకరిస్తోంది. సింగిల్ విండో పద్ధతి ద్వారా అనుమతులు, ఇతరత్రా వ్యవహారాల్లో కంపెనీలకు అండగా నిలబడుతోంది ప్రభుత్వం. టి హబ్ లాంటి వాటిని ఏర్పాటు చేసి స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నారు.

ఇంతకీ బిర్యానీ మేటర్ ఏంటి..?

అసలు కేటీఆర్, సత్య నాదెళ్ల మధ్య ఈ బిర్యానీ మేటర్ ఏంటి అనుకుంటున్నారా..? ఇటీవల సత్య నాదెళ్ల ఈ బిర్యానీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయార చేసిన చాట్ జీపీటీ ప్లాట్ ఫామ్ తో ఇటీవల సత్య నాదెళ్ల విభేదించిన సంగతి తెలిసిందే. దక్షిణాదిన అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహారం ఏంటి అని జీపీటీని సత్య నాదెళ్ల అడగగా.. ఇడ్లీ, వడ, దోసెతో పాటు బిర్యానీ పేరు కూడా ఆ జాబితాలో పేర్కొంది. బిర్యానీని దక్షిణాది టిఫిన్‌ గా పేర్కొనడం ద్వారా హైదరాబాద్‌ కు చెందిన తన తెలివితేటలను అవమానించొద్దని సత్య నాదెళ్ల చాట్‌ జీపీటీకి సూచించారు. ఆ విషయంలో తనకు ఆ సాఫ్ట్ వేర్ సారీ చెప్పిందని కూడా సత్య నాదెళ్ల తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు కేటీఆర్ కూడా బిజినెస్, బిర్యానీ అనే సరికి ఆ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

First Published:  6 Jan 2023 12:33 PM IST
Next Story