Telugu Global
Telangana

దగుల్బాజీలు, సన్నాసులు, వెధవలు...

రైతుల‌కు నీళ్లు ఇవ్వకుండా, కేసీఆర్ ని బద్నాం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై విమర్శలు ఎక్కుపెట్టారు కేటీఆర్. కేసుల‌కు, జైళ్ల‌కు తాము భ‌య‌ప‌డేది లేదన్నారు.

దగుల్బాజీలు, సన్నాసులు, వెధవలు...
X

సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ లీడర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ తో మొదలు పెడితే సిరిసిల్ల‌లో ఉన్న మ‌హేంద‌ర్ రెడ్డి వ‌ర‌కు అంద‌రూ ద‌గుల్బాజీలు, స‌న్నాసులు, చేత‌కాని వెధ‌వ‌లు.. అంటూ మండిపడ్డారు. తమపై కోపంతో రైతులు, నేతన్నలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దివాళాకోరు, దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలోని ముస్తాబాద్ లో క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట‌రీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


రైతుల‌కు నీళ్లు ఇవ్వకుండా, కేసీఆర్ ని బద్నాం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై విమర్శలు ఎక్కుపెట్టారు కేటీఆర్. కేసుల‌కు, జైళ్ల‌కు తాము భ‌య‌ప‌డేది లేదన్నారాయన. ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతూనే ఉంటామ‌ని తేల్చిచెప్పారు. తనపై కోపంతో సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ల నిర్మాణానికి మంజూరైన రూ.14 కోట్లను రద్దు చేశారని మండిపడ్డారు. వారికి ద‌మ్ముంటే తనకంటే ఎక్కువ అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు. దుబ్బాక నుంచి ముస్తాబాద్ వ‌ర‌కు తాను రెండు లైన్ల రోడ్డు మంజూరు చేయించానని, వారికి చేతనైతే 4 లైన్ల రోడ్డు వేయాలన్నారు. తనపై కోపంతో సిరిసిల్ల నేత‌న్న‌లను ఇబ్బంది పెడుతున్నారని, బ‌తుక‌మ్మ చీర‌ల ఆర్డ‌ర్లు ర‌ద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. చేత‌నైతే ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకోవాలి కానీ ఇలాంటి చిల్లర వేషాలు వేయొద్దని హెచ్చరించారు.

మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం..

డిసెంబర్ 9న అన్ని హామీలు అమలు చేస్తామని మాటిచ్చిన రేవంత్, ఇప్పుడు బదులు చెప్పాలని ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక అన్ని ప‌నుల‌ను ర‌ద్దు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాల‌పై కాంగ్రెస్ ప్ర‌చారం చేసుకుంటోందన్నారు. బీఆర్ఎస్ కేవ‌లం 4 ల‌క్ష‌ల ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని, ఆ విషయాన్ని కాంగ్రెస్, బీజేపీ గుర్తుంచుకోవాలన్నారు కేటీఆర్. క‌రీంన‌గ‌ర్‌ పార్లమెంట్ నియోజకవర్గానికి బండి సంజ‌య్ ఓం ఒరగబెట్టారని అన్నారు. మ‌తం పేరుతో ఓట్లు అడ‌గ‌డం త‌ప్ప బీజేపీ చేసిందేమీ లేదని, ఇప్పుడు అయోధ్య పేరు మీద ఓట్లు దండుకోవాల‌ని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 12న క‌రీంన‌గ‌ర్‌లో క‌ద‌న భేరి బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తామని చెప్పారు కేటీఆర్.

First Published:  5 March 2024 11:21 AM GMT
Next Story