డ్రగ్స్ టెస్టుకు సిద్ధం.. చిత్తశుద్దితో బయటకు వస్తే బండి సంజయ్ చెప్పు దెబ్బలు తింటాడా : మంత్రి కేటీఆర్
కరీంనగర్‌కు ఏం చేశావో చెప్పమని అడిగితే.. సమాధానమిచ్చే మొఖం లేదు. కానీ ఇలాంటి పిచ్చి అరుపులు, గావు కేకలు, పెడబొబ్బలు మాత్రం పెడతారంటూ సంజయ్‌పై ఫైర్ అయ్యారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. తనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న 'డ్రగ్స్' విమర్శలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను డ్రగ్స్ టెస్టు చేయించుకోవడానికి రెడీగా ఉన్నాను.. మరి కరీంనగర్ కమాన్ దగ్గర బండి సంజయ్ చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమేనా అని సవాలు విసిరారు. నియోజకవర్గాల ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు చేస్తున్న పలు విమర్శలపై విలేకరులు ప్రశ్నించగా.. కేటీఆర్ స్పందించారు.
డ్రగ్స్ టెస్టు నేను చేయించుకుంటా.. ఆ తర్వాత చిత్త శుద్దితో బయటకు వస్తాను. మరి అప్పుడు బండి సంజయ్ కరీంనగర్ చౌరస్తాలో చెప్పుదెబ్బలు తింటాడా అని కేటీఆర్ సవాలు విసిరారు. నా రక్తం తీస్తడా.. నా చర్మం తీసుకపోతడా.. ఏం తీసుకొని పోతే అది తీసుకొని పొమ్మను. నా తల వెంట్రుకలు కావాలంటే అది కూడా ఇస్తా.. నేను చిత్త శుద్దితో బయటకు వచ్చిన తర్వాత కరీంనగర్ కమాన్ దగ్గర చెప్పు దెబ్బలు తింటాడా అని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. నా చెప్పుకాదు.. ఆయన చెప్పుతో ఆయననే కొట్టుకోమనండి.. ఒక వేళ నా చెప్పు అంటే మళ్లీ అవమానపర్చిండు అంటూ మరో కొత్త రాగం ఎత్తుకుంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
'ఈ సవాలుకు సిద్ధమైతే చెప్పు.. ఇక్కడే కూర్చొని ఉంటా.. ఏ డాక్టర్‌ను తీసుకొని వస్తాడో, ఏ గుండు కొట్టే ఆయనను తీసుకొని వస్తాడో రమ్మను. నా బొచ్చు ఇస్తా.. నా రక్తం ఇస్తా.. నా గోర్లు ఇస్తా.. ఏది కావాలంటే అది ఇస్తా. కావాలంటే కిడ్నీ కూడా ఇస్తా' అంటూ బండి సంజయ్‌పై కేటీఆర్ విరుచుకపడ్డారు. ఈ రోజు నేను ఇస్తాను.. తర్వాత మోడీని ఇమ్మంటాను.. తర్వాత ఇంకొకరిని ఇమ్మంటా.. అసలు ఇదేమీ రాజకీయం అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్‌కు ఏం చేశావో చెప్పమని అడిగితే.. సమాధానమిచ్చే మొఖం లేదు. కానీ ఇలాంటి పిచ్చి అరుపులు, గావు కేకలు, పెడబొబ్బలు మాత్రం పెడతారంటూ సంజయ్‌పై ఫైర్ అయ్యారు.
ఎమ్మెల్సీ కవిత పేరు లిక్కర్ స్కామ్‌లో ఉందని, దీనిపై ఏం చేయబోతున్నారని విలేఖరులు ప్రశ్నించారు. ఈ దేశంలో ఏం జరుగుతున్నదో అందరూ చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నదే తెలంగాణలో కూడా జరుగుతోందని అన్నారు. తమను వ్యతిరేకించే వారిపై బీజేపీ ఇలాగే చేస్తోందని చెప్పారు. మోడీ.. బోడి.. ఆయన ఈడీ ఇదే కదా జరిగేది అని దుయ్యబట్టారు.
BRS Working President, Minister Sri @KTRTRS addressing the media in Sircilla https://t.co/zv1tWxLVKT
— BRS Party (@BRSparty) December 20, 2022