మా కష్టం మీ ఖాతాలో.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
మీరే శ్రీకారం చుట్టి మీరే లక్ష్యాన్ని చేరిన నాడు అది మీ సమర్థతకు ప్రతీక అవుతుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.
ఉద్యోగాలు, పెట్టుబడులు, ప్రాజెక్టుల విషయంలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ సర్కార్ పనులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానీకం ఎప్పటికీ నమ్మదంటూ ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్ ఇదే -
మొన్న.. 30 వేల ఉద్యోగాలు, నిన్న కాగ్నిజెంట్, ఇవాళ సీతారామ ప్రాజెక్టు.. ఇలా మా కష్టాన్ని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న కేటీఆర్.. హద్దుమీరిన అబద్ధాలతో ఇంకా ఎన్నిసార్లు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మీరే శ్రీకారం చుట్టి మీరే లక్ష్యాన్ని చేరిన నాడు అది మీ సమర్థతకు ప్రతీక అవుతుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. కానీ, బీఆర్ఎస్ సర్కార్ క్రెడిట్‌ను కొట్టేసే ప్రయత్నం మీరు ఎంత చేసినా నాలుగు కోట్ల ప్రజానీకం ఏమాత్రం నమ్మదని, తెలంగాణ సమాజం ఎప్పటికీ విశ్వసించదన్నారు కేటీఆర్.
ముఖ్యమంత్రి గారు..
— KTR (@KTRBRS) August 16, 2024
మొన్న...
30 వేల ఉద్యోగాలు మీరే ఇచ్చారన్నారు
నిన్న...
కాగ్నిజెంట్ కంపెనీని మీరే తెచ్చామన్నారు
నేడు...
సీతారామ ప్రాజెక్టును మీరే కట్టారంటున్నారు
మా కష్టాన్ని ఎన్నిసార్లు..
మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారు
హద్దుమీరిన అబద్ధాలతో..
ఇంకా ఎన్నిసార్లు…
గత ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసి, పరీక్షలు నిర్వహించిన దాదాపు 30 వేల ఉద్యోగాలకు రేవంత్ సర్కార్ నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. ఇక కాగ్నిజెంట్ విషయంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనే కాగ్నిజెంట్ విస్తరణకు ఒప్పందం కుదిరిందని, కానీ కాంగ్రెస్ సర్కార్ తమ గొప్పగా చెప్పుకోవడం సరికాదంటూ మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక సీతారామ ప్రాజెక్టు తమ హయాంలోనే నిధులు కేటాయించి, అనుమతులు తీసుకువచ్చి పూర్తి చేశామని బీఆర్ఎస్ చెప్తుంటే.. గడిచిన 8 నెలల కాలంలో వేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని కాంగ్రెస్ అంటోంది.