Telugu Global
Telangana

రేవంత్‌, మీ కొలువు సరే.. యువతకు కొలువులేవి - కేటీఆర్‌

ఉస్మానియా వర్సిటీ దేశ సరిహద్దుల్లో లేదని.. ఇంతగా పోలీసు బలగాలు, నిర్బంధం ఎందుకన్నారు కేటీఆర్. మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులను ఎందుకు కల్పిస్తున్నారని, నిత్యం పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నారని ప్రశ్నించారు.

రేవంత్‌, మీ కొలువు సరే.. యువతకు కొలువులేవి - కేటీఆర్‌
X

మెగా డీఎస్సీతో పాటు గ్రూప్‌ - 2, గ్రూప్‌ - 3 ఉద్యోగాలు పెంచాలని నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు కావొస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థుల ఆక్రందన.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వినపడడం లేదా అని ప్రశ్నించారు కేటీఆర్. మీరు కొలువు దీరితే సరిపోతుందా.. యువతకు కొలువులు అక్కర్లేదా అంటూ ట్వీట్ చేశారు.


గతంలో ఓ ఇంటర్వ్యూలో ఉస్మానియా విద్యార్థులను అడ్డా మీద కూలీల్లాంటి వారని రేవంత్ ఎగతాళి చేశారని గుర్తు చేశారు కేటీఆర్. తిన్నది అరిగేదాకా అరిచే బీర్, బిర్యానీ బ్యాచ్ అని బద్నాం చేశారని.. సిద్దాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని అవహేళనగా మాట్లాడాడ‌ని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉస్మానియా వర్సిటీని రణరంగంగా మార్చారని, డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారని ప్ర‌భుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. వందల మందిని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉస్మానియా వర్సిటీ దేశ సరిహద్దుల్లో లేదని.. ఇంతగా పోలీసు బలగాలు, నిర్బంధం ఎందుకన్నారు కేటీఆర్. మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులను ఎందుకు కల్పిస్తున్నారని, నిత్యం పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ చేతకానితనాన్ని ప్రశ్నించడమే నిరుద్యోగులు చేసిన నేరమా.. ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే పాపమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు కేటీఆర్. గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులకు అండగా ఉంటామన్నారు.

First Published:  9 July 2024 4:41 PM IST
Next Story