Telugu Global
Telangana

ఆలోగా ఆరు హామీలపై ఉత్తర్వులివ్వండి.. కేటీఆర్ డిమాండ్

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో గొప్పలు చెప్పారని, అసత్యాలు చెప్పినందుకు ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

ఆలోగా ఆరు హామీలపై ఉత్తర్వులివ్వండి.. కేటీఆర్ డిమాండ్
X

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 100 రోజుల డెడ్ లైన్ ని పొడిగించేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ గీస్తున్నారని, బీఆర్‌ఎస్ పాలనపై నిందలు వేస్తూ కాలం గడపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆరు హామీలలో భాగమైన మొత్తం 13 హామీల అమలుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.

కృష్ణా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి బదిలీ చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిర్ణయం అంటూ మండిపడ్డారు కేటీఆర్. ప్రతిపక్షాలను సంప్రదించకుండానే శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు అప్పగించారని, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అఖిలపక్ష కమిటీని వేయాలని డిమాండ్‌ చేశారు.

సీఎం క్షమాపణ చెప్పాలి..

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో గొప్పలు చెప్పారని, అసత్యాలు చెప్పినందుకు ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కేవలం 2 ఎకరాలున్న రైతులకు మాత్రమే కాంగ్రెస్ సాయం అందిందన్నారు. వరి కొనుగోలుకు రూ.500 బోనస్‌ ఇవ్వడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్న సీఎం.. హైదరాబాద్, ఢిల్లీలో తెలంగాణ భవన్లు, క్యాంపు కార్యాలయం నిర్మాణాలకు నిధులెక్కడినుంచి తెస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను ప్రభుత్వ సలహాదారులుగా నియమించడాన్ని తప్పుబట్టారు కేటీఆర్. కొత్త ప్రభుత్వం కుదురుకునే వరకు వేచి చూడాలనుకున్నామని, కానీ కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టక తప్పడం లేదని చెప్పారు.

First Published:  26 Jan 2024 7:01 AM IST
Next Story