Telugu Global
Telangana

కండకావరంతో మాట్లాడొద్దు.. వెంటనే క్షమాపణలు చెప్పు

ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, లక్షలాదిమంది యువతకు సంబంధించిన అంశం అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, క్షేత్ర స్థాయిలో నిలదీస్తామన్నారు.

కండకావరంతో మాట్లాడొద్దు.. వెంటనే క్షమాపణలు చెప్పు
X

పోటీ పరీక్షలు వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నవారిలో ఒక్కరు కూడా అభ్యర్థులు లేరని, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు దీక్షలతో పనేంటని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరీక్షలు వాయిదా వేయకపోగా, అభ్యర్థుల ఆందోళనను తక్కువచేసి మాట్లాడటమేంటని బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. అభ్యర్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా.. దిగజారి, దివాళకోరుతనంతో ముఖ్యమంత్రి మాట్లాడారని మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్ ని అవమానించేలా మాట్లాడారన్నారు. అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగం సంపాదించుకున్న రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, వాటి యజమానుల్ని అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్.


క్షమాపణ చెప్పాల్సిందే..

సీఎం రేవంత్ అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్న రేవంత్ రెడ్డి.. ఆయన వెంటనే తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిన అదే యువత ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తోందని అంటున్నారు కేటీఆర్. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల హామీలిచ్చిన రేవంత్ రెడ్డి, 8 నెలల్లో ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, నాలుగు నెలల్లో ఏవిధంగా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తారని ప్రశ్నించారు.


ఇది యువత సమస్య..

ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, లక్షలాదిమంది యువతకు సంబంధించిన అంశం అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, క్షేత్ర స్థాయిలో నిలదీస్తామన్నారు. విద్యార్థులతో నిరుద్యోగులతో కలిసి కొట్లాడతామన్నారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఇగోలకు, భేషజాలకు పోకుండా నిర్ణయం తీసుకోవాలని.. అభ్యర్థులు కోరినట్టు వాయిదా వేయాలన్నారు. గతంలో ఏ పరీక్షకు అప్లై చేశారని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో కలసి దీక్ష చేశారో చెప్పాలని నిలదీశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారని, ఆయన సీఎం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలపై, నోటిఫికేషన్లపై, జాబ్ క్యాలెండర్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

First Published:  14 July 2024 9:18 AM GMT
Next Story