Telugu Global
Telangana

పెళ్లి కాలేదు కానీ.. పిల్లలెలా పుట్టారు..?

30 వేల ఉద్యోగాల‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ ఇస్తే, రేవంత్ రెడ్డి కేవలం నియామ‌క ప‌త్రాలు ఇచ్చి చంకలు గుద్దుకుంటున్నారని, ఆ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్.

పెళ్లి కాలేదు కానీ.. పిల్లలెలా పుట్టారు..?
X

ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ముందు నోటిఫికేష‌న్ విడుదల చేయాలని, ఆ తర్వాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఉంటాయని, అవన్నీ పూర్తయిన తర్వాతే నియామ‌క ప‌త్రం ఇస్తారని.. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవేవీ లేకుండానే 30వేల ఉద్యోగాలిచ్చామని చెబుతోందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నోటిఫికేషన్ ఇవ్వకుండానే, పరీక్ష పెట్టకుండానే, ఇంటర్వ్యూ చేయకుండానే ఉద్యోగాలిచ్చిన ఘనత రేవంత్ కే దక్కుతుందని కౌంటర్ ఇచ్చారు. "పెళ్లి కాకుండానే, సంపారం అయిపోయి, పిల్ల‌లు మాత్రం పుట్టారా, ఎలా పుట్టారు..?" అంటూ ప్రశ్నించారు కేటీఆర్.


నిరుద్యోగుల్ని పిచ్చివాళ్లను చేయడానికి నోటికొచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు కేటీఆర్. 30 వేల ఉద్యోగాల‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ ఇస్తే, రేవంత్ రెడ్డి కేవలం నియామ‌క ప‌త్రాలు ఇచ్చి చంకలు గుద్దుకుంటున్నారని, ఆ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి ముఖ్యమంత్రికి బుద్ది చెప్పాలంటే ఆయన ఇచ్చిన 2 ల‌క్ష‌ల ఉద్యోగాల హామీ నెర‌వేరాలంటే, ఆ ఒత్తిడి తేవాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపిస్తే శాస‌న‌మండ‌లిలో ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాడ‌ని అన్నారు కేటీఆర్.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఫీజుల్లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తామ‌ని ఆ పార్టీ నాయకులు చెప్పారని, కానీ మాట తప్పారని మండిపడ్డారు కేటీఆర్. కేసీఆర్ హ‌యాంలో టెట్‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 400 గా ఉంటేనే రేవంత్ రెడ్డి నానా యాగీ చేశారని, ఇప్పుడు ఆయన హయాంలో వెయ్యి రూపాయలకు ఫీజు పెంచారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. మొద‌టి కేబినెట్ స‌మావేశంలో మెగా డీఎస్సీ వేస్తామ‌న్నారని, ఆ హామీ కూడా నెర‌వేర‌లేదన్నారు. సింగ‌రేణిలో తాము 24 వేల వార‌స‌త్వ ఉద్యోగాలు ఇస్తే.. ఆ కంపెనీని అదానీకి అమ్మేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇల్లందులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

First Published:  20 May 2024 2:46 PM IST
Next Story