Telugu Global
Telangana

అంశాల స్వామి మృతి.. కేటీఆర్ సంతాపం

అంశాల స్వామి ఎంతో మందికి స్పూర్తి, ఆయన ఎప్పటికీ నా మనసుకి దగ్గరివాడే అని ట్వీట్ చేశారు కేటీఆర్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు.

అంశాల స్వామి మృతి.. కేటీఆర్ సంతాపం
X

నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య గురించి తెలిసినవారికి అంశాల స్వామి కూడా చిర పరిచయమే. ఫ్లోరైడ్ బాధితుడైన అంశాల స్వామి ఆ సమస్య పరిష్కారం కోసం నిరంతరం పోరాడారు. గత ప్రభుత్వాలతో కొట్లాడారు. ఉద్యమాలు నడిపించారు. మీడియా ద్వారా ఆ సమస్య అందరికీ తెలిసే ప్రయత్నం చేశారు. కానీ చిన్న వయసులోనే ఆయన మృతిచెందారు. ఆయన వయసు 32 ఏళ్లు. అంశాల స్వామి మృతిపట్ల మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ట్విట్టర్లో వారి కుటుంబానికి సంతాపం ప్రకటించారు.

ఇటీవలే అంశాల స్వామి బైక్ పైనుంచి పడిపోయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిగా మంచానికే పరిమితమైన ఆయన, అనారోగ్యంతో చనిపోయారు. నల్గొండ జిల్లా ప్లోరోసిస్ లిబరేషన్ కమిటీ నాయకుడిగా ఆయన పోరాటాలు మొదలు పెట్టారు. అంశాల స్వామి ఎంతో మందికి స్పూర్తి, ఆయన ఎప్పటికీ నా మనసుకి దగ్గరివాడే అని ట్వీట్ చేశారు కేటీఆర్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు. అంశాల స్వామితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను షేర్‌ చేశారు కేటీఆర్‌.


మంత్రి కేటీఆర్ గత అక్టోబర్ లో శివన్న గూడెంలోని అంశాల స్వామి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. ఆయన తల్లితండ్రులను పలకరించారు. కాసేపు అంశాల స్వామితో మాట్లాడిన ఆయన, హెయిర్ కటింగ్ సెలూన్, ఇంటి నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం కోసం రూ. 5.50 లక్షలు మంజూరు చేయించారు. ఇంటి నిర్మాణ పనులను కేటీఆర్ స్వయంగా పర్యవేక్షించి పూర్తయ్యేలా చొరవ కూడా చూపారు. గతంలో కూడా కేటీఆర్ తనకు పలు సందర్భాల్లో ఆర్థిక సాయం చేసినట్టు ఆరోజు అంశాల స్వామి తెలిపారు. కేటీఆర్ తన ఇంటికి వచ్చి తనతో కలసి భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు. నెలల వ్యవధిలోనే అంశాల స్వామి మరణించడం బాధాకరం. ఆ సంఘటనను గుర్తు చేసుకుని కేటీఆర్ విషాదంతో ట్వీట్ చేశారు.

First Published:  28 Jan 2023 4:57 AM GMT
Next Story