Telugu Global
Telangana

ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్ లకు రక్షణ లేదా..?

జర్నలిస్ట్ లపై పోలీసుల దాడుల్ని పలువురు నేతలు ఖండించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ ని కేటీఆర్ ఫోన్ లో పరామర్శించారు.

ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్ లకు రక్షణ లేదా..?
X

నిరుద్యోగుల ఆందోళనలు తెలంగాణలో రాజకీయ రచ్చగా మారాయి. పోటీ పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ వారికి మద్దతు తెలిపింది, ఆ నిరసనలకు అండగా ఉంటోంది. దీంతో ప్రభుత్వం ప్రతిష్టకు పోయింది. పరీక్షలు వాయిదా వేసేది లేదని తేల్చి చెప్పింది. వాయిదా వేయాలని అడుగుతున్న వారి వెనక రాజకీయ శక్తులు ఉన్నాయని, కోచింగ్ సెంటర్ల మాఫియా ఉందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం ప్రకటనతో ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి, పరీక్షలు వాయిదా వేసే వరకు వెనకడుగు వేసేది లేదంటూ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. ఉస్మానియా యూనివర్శిటీలో జరుగుతున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. వార్తల్ని కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్ట్ ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

అక్రమ అరెస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ వేసారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్ లకు రక్షణ లేదా అని ఆయన ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా ? డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే పాపమా ? అని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీడియాపై దాడులు మొదలయ్యాయని ఆయన ఆరోపించారు. ఇటీవల బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తనని ఆయన ఖండించారు. ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా? అని ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి, ఉస్మానియాలో ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయన్నారు. పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్లకంచెలు అడగడుగునా దర్శనమిస్తున్నాయన్నారు కేటీఆర్.


జర్నలిస్ట్ లపై పోలీసుల దాడుల్ని పలువురు నేతలు ఖండించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ ని కేటీఆర్ ఫోన్ లో పరామర్శించారు. ప్రభుత్వ దమనకాండకు భయపడేది లేదన్నారు. ప్రజల పక్షాన నిలబడిన జర్నలిస్ట్ లకు ప్రతిపక్షాలు అండగా ఉంటాయన్నారు కేటీఆర్. జర్నలిస్టులపట్ల పోలీసుల వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.

First Published:  11 July 2024 7:56 AM IST
Next Story