Telugu Global
Telangana

ఎంతోమందిని చూశాం.. రేవంత్ వి వట్టి ప్రగల్భాలు

ఢిల్లీ మన మాట వినాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించాలని అన్నారు కేటీఆర్. బీఆర్‌ఎస్‌ ఎంపీలుంటేనే పార్లమెంటులో మన గొంతు వినపడుతుందన్నారు.

ఎంతోమందిని చూశాం.. రేవంత్ వి వట్టి ప్రగల్భాలు
X

బీఆర్‌ఎస్‌ను పాతిపెడతానంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్‌ లాంటి బుడ్డర్‌ ఖాన్‌లను కేసీఆర్‌ ఎంతోమందిని చూశారన్నారు. ఎంతో మంది తీస్మార్ ఖాన్‎లను మాయం చేసి తెలంగాణ తెచ్చారని చెప్పారు. మన బాస్‎లు ఢిల్లీలోనో, గుజరాత్‎లోనో లేరని, ఢిల్లీ మన మాట వినాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించాలని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలుంటేనే పార్లమెంటులో మన గొంతు వినపడుతుందన్నారు. ఘట్‌కేసర్‌లో జరిగిన మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ విజయోత్సవ సభకు హాజరైన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.


420 హామీలిచ్చి కాంగ్రెస్‌ ఎన్నికల్లో గెలిచిందన్నారు కేటీఆర్. డిసెంబర్‌ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పారని, అధికారంలోకి వచ్చి 2నెలలు గడుస్తున్నా ఆ ప్రస్తావనే లేదని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలు జుట్లు పట్టుకుంటున్నారని, మరోవైపు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డునపడ్డారని, కడుపు కాలిన ఆటోడ్రైవర్‌ ప్రజాభవన్‌ ముందు ఆటో కాలబెట్టాడని.. ఇవన్నీ కాంగ్రెస్ మార్కు పాలనకు నిదర్శనం అని ఎద్దేవా చేశారు కేటీఆర్. కేసీఆర్ సీఎం కాలేదని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు.

లంకె బిందెలు కావాలా నాయనా..?

లంకె బిందెల కోసం వెతికే వారు అధికారంలోకి వచ్చారని సెటైర్లు పేల్చారు కేటీఆర్. సెక్రటేరియట్‎లో కంప్యూటర్లు, జీవోలు ఉంటాయి కానీ.. లంకె బిందెలు ఉండవన్నారు. లంకెబిందెల కోసం వెదికేది ఎవరో ప్రజలకు తెలుసని, ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజల తరపున పోరాడతామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలెవరికి అన్యాయం జరిగినా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం వస్తామని చెప్పారు కేటీఆర్.

First Published:  2 Feb 2024 5:51 PM IST
Next Story