Telugu Global
Telangana

అసెంబ్లీలో కేటీఆర్ క్లాస్‌.. హామీలు, అప్పులు, ఆస్తులపై క్లారిటీ..!

ఆనాడు 2014లో ట్రాన్స్ కో ఆస్తులు 7,461 కోట్లుగా ఉంటే ఇవాళ రూ.24,476 కోట్లకు పెంచామన్నారు. ఆనాడు జెన్‌ కో ఆస్తులు రూ.19,607 కోట్లుగా ఉంటే.. ఇవాళ రూ.53,963 కోట్లకు పెరిగాయన్నారు.

అసెంబ్లీలో కేటీఆర్ క్లాస్‌.. హామీలు, అప్పులు, ఆస్తులపై క్లారిటీ..!
X


తెలంగాణ అసెంబ్లీ తొలి సెషన్‌లోనే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికార పార్టీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూనే.. విద్యుత్‌ శాఖ, పౌర సరఫరాల శాఖ అప్పుల విషయమై చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ రెండు గ్యారెంటీలను అమలు చేశామని అబద్ధాలు చెప్తోందని.. రెండు గ్యారెంటీలను పాక్షికంగా మాత్రమే అమలు చేశారన్నారు. మహాలక్ష్మి గ్యారెంటీ కింద మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం సహా రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న హామీలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డులున్న కోటిన్నర మంది మహిళలు ఈ రెండు పథకాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. చేయూత కింద అందిస్తామన్న రూ.4 వేల పెన్షన్ కూడా విడుదల చేయాలని గుర్తుచేశారు. ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారని.. వీటన్నింటిని వంద రోజుల్లో పూర్తిచేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు కేటీఆర్. డిసెంబర్ 7 నుంచి మార్చి 17 నాటికి వంద రోజులు పూర్తవుతాయని.. ఆ లోపు పథకాలు అమలు చేస్తే స్వాగతిస్తామని, ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు కేటీఆర్.


ఇక అప్పుల విషయంలో ఆరోపణలపైనా క్లారిటీ ఇచ్చారు కేటీఆర్. గవర్నర్ ప్రసంగంలో కేవలం అప్పులను మాత్రమే ప్రస్తావించారని.. గత పదేళల్లో సృష్టించిన ఆస్తులను మాత్రం ఉద్దేశపూర్వకంగా దాచే ప్రయత్నం చేశారన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో పరిశ్రమలకు వారానికి రెండు రోజుల పవర్‌ హాలీడేలు, రైతులకు 5-6 గంటలు కరెంటు ఇవ్వని పరిస్థితి ఉండేదన్నారు. రూ.81 వేల 516 కోట్ల అప్పులు చేశారని అధికార పక్షం చెప్తోందన్నారు కేటీఆర్‌. కానీ, కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో సృష్టించిన ఆస్తుల గురించి ప్ర‌స్తావించ‌లేద‌న్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా బ‌ద్నాం చేయ‌డానికి, అప్పుల సాకు చెప్పి ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తుంద‌న్నారు.

2014లో విద్యుత్ శాఖ అత్యంత భయంకరంగా, దురావస్థలో ఉండేదన్నారు. ఆనాడు 2700 మెగావాట్ల కరెంటు లోటు ఉండేదన్నారు. ఆనాటికే 22 వేల 423 కోట్ల రూపాయ‌ల అప్పు ఉండేదన్నారు. ఆనాడు 2014లో ట్రాన్స్ కో ఆస్తులు 7,461 కోట్లుగా ఉంటే ఇవాళ రూ.24,476 కోట్లకు పెంచామన్నారు. ఆనాడు జెన్‌ కో ఆస్తులు రూ.19,607 కోట్లుగా ఉంటే.. ఇవాళ రూ.53,963 కోట్లకు పెరిగాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తుల విలువ రూ.1,37,571 కోట్లని చెప్పారు కేటీఆర్. అప్పులు మాత్రమే చూపించి ఆస్తులు దాస్తామంటే కుదరదంటూ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.

First Published:  16 Dec 2023 1:15 PM IST
Next Story