Telugu Global
Telangana

అన్ని రంగాల్లో తెలంగాణ మీరాష్ట్రాలకన్నా ముదుంది... ‍సింధియాకు కేటీఆర్ కౌంటర్

హైదరాబాద్ రోడ్లపై కామెంట్లు చేసిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మీ రాష్ట్రం మా తెలంగాణ కన్నా ఏ ఒక్క విషయంలోనైనా ముందంజలో ఉందా అని ప్రశ్నించారు.

KTR
X

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

మీ సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ మా తెలంగాణ కన్నా ఎందులో ముందంజలో ఉందో ఒక్క మాటలో చెప్పాలని తెలంగాణ మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాను సవాల్ చేశారు. తెలంగాణ మాదిరి బీజేపీ పాలిత రాష్ట్రాలు మంచి పనితీరును కనబరచి ఉంటే 75 వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి దేశ ఎకానమీ 10 ట్రిలియన్లకు చేరి ఉండేదని ఆయన ట్వీట్ చేశారు. 2.5 శాతం జనాభాతో ఉన్న మా తెలంగాణ భారత జీడీపీలో దేశానికి 5 శాతం ఆదాయాన్నిస్తోందని, తెలంగాణాలో ప్రతి పౌరుడు దేశానికి డబుల్ ఇంజన్ వంటివాడని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ లో నీటితో నిండి ఉన్న రోడ్లను చూసి జ్యోతిరాదిత్య సింధియా చేసిన ట్వీట్ పై మండిపడి.. కేటీఆర్ ఈ సవాల్ చేశారు. హైదరాబాద్ లోని రోడ్ల దుస్థితిని చూసి చాలా అసంతృప్తి చెందానని,10 నిముషాల దూరం వెళ్ళడానికి తనకు 30 నిముషాలు పట్టిందని సింధియా వాపోయారు. 10 వేల కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం వెయ్యి కిలోమీటర్ల రోడ్డును మంజూరు చేస్తే.. ఈ నగర దుస్థితి ఇలా ఉందంటూ ఓ రోడ్డు ఫోటోను ఆయన తన ట్వీట్ కి జోడించారు.. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేయడానికి చేపట్టిన లోక్ సభా ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ నగరానికి చేరుకున్నారు.

తెలంగాణలోని మా నగరాలతో పోల్చి మీ రాష్ట్రాల్లోని నగరాలను చూడాలంటూ కేటీఆర్ లోగడ అనేకసార్లు బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. 'ఆవో', 'దేఖో', 'సీఖో' .. తెలంగాణాలో మేము అమలు చేసిన పాలసీలు, పథకాలను కేంద్రం కాపీ కొట్టింది' అంటూ ఆయన ట్వీట్ చేశారు. మిషన్ భగీరథ, రైతు బంధు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలనే కేంద్రం జల్ శక్తి అభియాన్, కిసాన్ సమ్మాన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలుగా పేర్లు మార్చి అమలు చేస్తోందని టీఆరెస్ నేతలు లోగడ వ్యాఖ్యానించారు.





First Published:  30 July 2022 1:50 PM GMT
Next Story