కేసు పెడితే పెట్టుకో.. జైళ్లో యోగా చేసి పాదయాత్రకు రెడీ అవుతా
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ ను ఖతం చేయాలని చూస్తున్నయ్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతియ్యొద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. గురువారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టాలని రేవంత్ చూస్తున్నాడని తెలిపారు. ''కేసు పెడితే పెట్టుకో.. నన్ను జైళ్లో పెట్టి పైశాచిక ఆనందం పొందు.. రెండు, మూడు నెలలు జైళ్లో ఉండి యోగా చేసి ట్రిమ్ గా వస్తా.. ఆ తర్వాత పాదయాత్ర చేస్తా..'' అన్నారు. ''ఈ సన్నాసి ఎవరు చెప్పినా సరే వినటం లేదు. ఏం చేసుకుంటావో చేసుకో.. రోజుకో రకంగా ప్రచారం చేస్తున్నందుకే మొత్తం ఏం జరిగిందో నేనే ప్రజలకు చెబుతున్న.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ ను ఖతం చేయాలని రాజ్ భవన్ లో ప్రయత్నం చేశాయి.. అయినా సరే నేను దేనికైనా రెడీగా ఉన్న.. ప్రజల తరఫున పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.. హైదరాబాద్ కు అంతర్జాతీయంగా పేరు తెచ్చినందుకు కేసు పెడతావా? లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకా? బెంగళూరు కన్నా ఐటీ ఎగుమతులను పెంచినందుకా? ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించినందుకా? ఎందుకు కేసు పెడతావు.. నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా మేము నీ హామీలపై పోరాటం చేస్తూనే ఉంటాం.. ఇవ్వాళ ఓ పేపర్ లో టార్గెట్ కేటీఆర్ అని రాశారు.. కానీ ప్రభుత్వం ఇచ్చిన హమీలపై కదా వాళ్ల టార్గెట్ ఉండాల్సింది..'' అన్నారు.
హైదరాబాద్ కు ఫార్ములా వన్.. ఫార్ములా ఈ రేసులు తేవడానికి ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలను కేటీఆర్ వివరించారు. 1894లో మొదటి కార్ రేస్ పారిస్ లో జరిగిందని, మొదటి ఫార్ములా వన్ రేస్ 1946లో ఇటలీలో జరిగిందన్నారు. ఫార్ములా వన్ నిర్వహించేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతాయని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2003లో హైదరాబాద్ లో ఫార్ములా వన్ రేస్ నిర్వహించాలని ప్రయత్నం చేశారని.. గోపన్‌పల్లిలో 400 ఎకరాల భూమి సేకరించి డెడికేటెడ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. కేసులు భూములు ఇచ్చేందుకు వ్యతిరేకించి కోర్టులో కేసు వేశారని, 21 ఏళ్లుగా ఆ కేసు నడుస్తోందన్నారు. మాయావతి యూపీ సీఎంగా ఉన్నప్పుడు నోయిడాలో ఫార్ముల్ వన్ రేస్ నిర్వహించారని, ఇందుకోసం 2011లో దాదాపు రూ.17 వందల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్ కోసం రూ.70,600 కోట్లు ఖర్చు చేస్తే అందులో అక్రమాలు జరిగాయని సురేశ్ కల్మాడీని జైళ్లో పెట్టారని తెలిపారు. ఏ క్రీడలు నిర్వహించిన ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేయడం సర్వసాధారణమన్నారు. జమ్మూకశ్మీర్ లో మోటార్ రేసింగ్ ను ప్రమోట్ చేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారని, రాహుల్ గాంధీకి మోటార్ రేసింగ్ అంటే అభిరుచి అని తెలిపారు.
బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఫార్ములా వన్ రేస్ హైదరాబాద్ కు తెచ్చేందుకు ప్రయత్నించామని.. ఇండియాలో రేస్ నిర్వహించే ఇంట్రస్ట్ లేదని చెప్పారని వివరించారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ దే భవిష్యత్ కాబట్టి ఫార్ములా -ఈ రేస్ హైదరాబాద్ కు తేవడానికి ప్రయత్నించామన్నారు. సియోల్, జోహనెస్ బర్గ్ ను కాదని హైదరాబాద్ ఫార్ములా -ఈ రేస్ తేగలిగామని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు హైదరాబాద్ ను అడ్డగా మార్చేందుకే ఈ రేస్ తెచ్చామన్నారు. ఎఫ్ - ఈ రేస్ కమిటీలో ఆనంద్ మహీంద్ర మెంబర్ గా ఉండేవారని తెలిపారు. ఈ రేస్ ద్వారా తెలంగాణలో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు బీవైడీ అనే సంస్థ ముందుకు వచ్చిందని.. సరిహద్దుల్లో నెలకొన్న గొడవల కారణంగా ఆ పెట్టుబడులు రాలేదని తెలిపారు. ఫార్ములా - ఈ రేస్ కోసం ప్రభుత్వం తరపున రూ.40 కోట్లు, గ్రీన్ కో అనే ప్రైవేట్ భాగస్వామి రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టిందని తెలిపారు. ఈ రేస్ ద్వారా నేరుగా రూ.700 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. అదే సమయంలో నిర్వహించిన ఈ మొబిలిటీ వీక్ లో అమరరాజ బ్యాటరీస్, హుందయ్ తదితర సంస్థలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయన్నారు. ఈ - రేస్ ప్రమోషన్ కోసం ముంబయికి వెళ్తే.. ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఈ - రేస్ ను మీరు హైదరాబాద్ కు తీసుకెళ్లారని ఓపెన్ గానే మాట్లాడరని గుర్తు చేశారు.
ఫార్ములా -ఈ రేస్ ను నాలుగేళ్ల పాటు నిర్వహించేలా నిర్వహణ సంస్థ, హెచ్‌ఎండీఏ, గ్రీన్ కోతో అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. ఈ రేస్ తో ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా తమకేమి ప్రయోజనం లేదని గ్రీన్ కో పక్కకు తప్పుకుందని తెలిపారు. స్పాన్సర్ గా ఉన్న గ్రీన్ కో తప్పుకోవడంతో ఈ రేస్ చేజారి పోకుండా ఉండేందుకు ఆ డబ్బులను ప్రభుత్వం నుంచే ఇద్దామని తానే స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ కు చెప్పానన్నారు. స్పాన్సర్లు దొరికే వరకు తానే భరోసా ఉంటానని చెప్పానని అన్నారు. హెచ్‌ఎండీఏకు తెలిసే చెల్లింపులు చేశామన్నారు. ఈ - రేస్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే రూ.55 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇందులో స్పెషల్ సీఎస్ తప్పేమి లేదన్నారు. ఆ మొత్తానికి తానే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. హెచ్‌ఎండీఏ బోర్డుకు సీఎం చైర్మన్ అయితే, ఎంఏయూడీ మినిస్టర్ వైస్ చైర్మన్ అని తెలిపారు. దానికి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదని, హెచ్‌ఎండీఏ ఇండిపెండెంట్ బోర్డు అని తానే చెప్పానన్నారు. ఈ - రేస్ వల్ల హైదరాబాద్ పేరు 49 దేశాల్లో తెలిసేలా చేశామన్నారు. ఎన్నో పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేశామన్నారు. కూలగొట్టుడు, విధ్వంసం చేయడం వాళ్లకు తెలిసిన పని.. నిర్మాణం తమకు తెలిసిన పని అన్నారు. ఫార్ములా - ఈ రేసును తనపై కోపంతో రద్దు చేశారని.. ఈ చర్య సిగ్గు చేటు అని జాగ్వర్, నిస్సాన్ లాంటి సంస్థలు అన్నాయని తెలిపారు. రేవంత్ దిక్కుమాలిన నిర్ణయంతో ప్రపంచం ముందు హైదరాబాద్ ఇజ్జత్ పోయిందని అన్నారు. ఏసీబీ ఫుల్ ఫామ్ రేవంత్ కు తెలుసా అని ప్రశ్నించారు. ఈ రేస్ చెల్లింపుల్లో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలన్నారు. హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహిస్తానని రేవంత్ అంటున్నారని.. అందుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా అని ప్రశ్నించారు. మేఘా కృష్ణారెడ్డిపై ఏసీబీ కేసు పెట్టే దమ్ము రేవంత్ కు ఉందా అన్నారు. రాఘవ, మేఘా కంపెనీలకు కేకులు కోసినట్టు కాంట్రాక్టులు ఇస్తున్న సీఎంపైనే కేసులు పెట్టాలన్నారు. రూ.50 లక్షల బ్యాగ్ తో దొరికిన రేవంత్ పై ఎనిమిదేళ్లుగా ఏ చర్యలు లేవన్నారు. హైదరాబాద్ కు విశ్వనగరం అనే బ్రాండ్ ఇమేజ్ లేకుంటే పెట్టుబడులు వస్తాయా అని ప్రశ్నించారు.