Telugu Global
Telangana

మే నెలాఖరులోగా వార్డు పాలనా వ్యవస్థ ఏర్పాటు.. అధికారులను ఆదేశించిన కేటీఆర్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) లోని మొత్తం 150 వార్డులకు ఈ నెలాఖరుకల్లా స్థానిక వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

మే నెలాఖరులోగా వార్డు పాలనా వ్యవస్థ ఏర్పాటు.. అధికారులను ఆదేశించిన కేటీఆర్
X

పరిపాలనను పౌరులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో, రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో వార్డు పాలన వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయించింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)లోని మొత్తం 150 వార్డులకు ఈ నెలాఖరుకల్లా స్థానిక వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

బుధవారం సీనియర్ అధికారులతో విస్తృతంగా సమీక్షించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, పౌరులు వారి ఫిర్యాదులను పరిష్కరించుకోవ‌డానికి, సూచనలను ఇవ్వ‌డానికి వారికి దగ్గరగా ఉండేలా స్థానిక వార్డు కార్యాలయం ఉండాలన్నారు.

మే నెలాఖరులోగా వార్డు పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేటీఆర్ అధికారులను కోరారు. ప్రతి వార్డు కార్యాలయానికి అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి నాయకత్వం వహిస్తారు. పారిశుధ్యం, రోడ్ల నిర్వహణ, విద్యుత్ సరఫరా, వెటర్నరీ విభాగం, వాటర్ బోర్డ్, టౌన్ ప్లానింగ్ వింగ్‌లకు సంబంధించిన క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది ప్రతి వార్డు కార్యాలయంలో ఉండాలన్నారు.

స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని త్వరగా పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని మంత్రి తెలిపారు. పౌరులు తమ సమస్యల పరిష్కారానికి సర్కిల్ లేదా జోనల్ కార్యాలయాలకు వెళ్ళాల్సిన‌ అవసరం లేకుండా వార్డు గవర్నెన్స్ సిస్టమ్ పని చేస్తుందని కేటీఆర్ తెలిపారు.

కొత్త వ్యవస్థ పాలనలో పౌరులను మరింతగా భాగస్వామ్యం చేస్తుంది. "పాలనను వికేంద్రీకరించడం, పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా వార్డు పాలన రూపొందించ‌బడింది" అని కేటీఆర్ తెలిపారు.

కొత్త కాన్సెప్ట్‌కు అవసరమైన టీంలను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

First Published:  3 May 2023 5:38 PM IST
Next Story