Telugu Global
Telangana

పెయింటింగ్ కళాకారులకు కేటీఆర్ అభినందన

వారి ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు కేటీఆర్. వారు రూపొందించిన టీ షర్ట్ లను ఆయన ఆవిష్కరించారు.

పెయింటింగ్ కళాకారులకు కేటీఆర్ అభినందన
X

తెలంగాణలో అతి ప్రాచీన జానపద చిత్రకళగా చేర్యాల పెయింటింగ్స్‌కి పేరుంది. దీనినే నకాశి చిత్రకళ అని కూడా అంటారు. ఈ చిత్రకళకు ఆధునికతను మేళవించి ప్రపంచ వ్యాప్తంగా దానికి పేరు తెచ్చారు స్థానిక కళాకారులు. ప్రపంచ వేదికలపై కూడా ప్రశంసలందుకున్నారు. చేర్యాల చిత్రకళకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) కూడా లభించడం విశేషం. ఈ పెయింటింగ్ లను టీ షర్ట్ లపై చిత్రీకరించి చేర్యాల చిత్రకళకు మరింత ప్రాచుర్యం తెచ్చారు రాకేష్, వినయ్. వారి ప్రతిభను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెచ్చుకున్నారు.


చేర్యాల చిత్రకళను టీ షర్ట్ లపై రూపొందించిన రాకేష్, వినయ్.. ప్రగతి భనన్ లో కేటీఆర్ ని కలిశారు. చేర్యాల చిత్రకళకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు తామ చేస్తున్న ప్రయత్నాలను వారు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా వారి ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు కేటీఆర్. వారు రూపొందించిన టీ షర్ట్ లను ఆయన ఆవిష్కరించారు.

అందమైన పెయింటింగ్ లు చాలామంది వేస్తుంటారు. కానీ వాటి ప్రచారానికి వినూత్న ప్రయత్నాలు చేసినప్పుడే పురాతన కళలకు కూడా మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు కేటీఆర్. ఇలాంటి వినూత్న పద్ధతులతో సంప్రదాయ కళలకు మరింత డిమాండ్‌ పెరుగుతుందన్నారు. వీటికి ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ అవసరం ఉందని సూచించారు. జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ పొందిన చేర్యాల పెయింటింగ్‌ వంటి ఉత్పత్తులకు మరింత ప్రచారం కల్పిస్తే కళాకారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. తెలంగాణ సంప్రదాయ కళలకు, కళాకారులకు తనవంతు సహాయం ఎప్పుడూ ఉంటుందన్నారు కేటీఆర్. చేర్యాల కళను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు.

First Published:  21 Jan 2024 7:03 AM IST
Next Story