Telugu Global
Telangana

ఉద్యోగం చేయడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి - కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ బాసర త్రిబుల్ ఐటీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఇక్కడ మౌలిక వసతులు పెంచాల్సిన బాధ్యత మాది, కాపాడుకోవాల్సిన బాధ్యత మీది అన్నారు. వారానికి ఒక రోజు విద్యార్థులందరూ ఒక గంట సేపు యూనివర్సిటీని క్లీన్ చేసుకోవాలని ఆయన సూచించారు.

ఉద్యోగం చేయడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి - కేటీఆర్
X

కేటీఆర్ ఈ రోజు బాసర త్రిబుల్ ఐటీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి హాస్టళ్ళ స్థితిగతులను ప్రత్యక్షంగా చూశారు.అనంతరం జరిగిన సభలో ఆయన‌ విద్యార్థులను ఉద్దేశించిమాట్లాడుతూ...

ఈ విద్యాసంస్థ మీదని దీనిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఎంత ఉందో మీ మీద కూడా అంతే ఉందన్నారు కేటీఆర్.ఇక్కడ మౌలిక వసతులు పెంచాల్సిన బాధ్యత మాది, కాపాడుకోవాల్సిన బాధ్యత మీది అన్నారు కేటీఆర్. వారానికి ఒక రోజు విద్యార్థులందరూ ఒక గంట సేపు యూనివర్సిటీని క్లీన్ చేసుకోవాలని ఆయన సూచించారు.

ఐటీ, విద్యాశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని, ఇక్కడ అదనంగా 50 తరగతి గదులు ఆధునీకరిస్తామని కేటీఆర్ చెప్పారు. క్రీడల కోసం రూ.3 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణాన్ని 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేస్తామన్నారు కేటీఆర్.

''మనకన్నా చాలా తక్కువ జనాభా ఉన్న అమెరికా లాంటి దేశాల నుంచి అనేక కొత్తరకం ఉత్పత్తులు వస్తున్నాయి. అత్యధిక జనాభా కలిగిన‌ మన దేశం నుంచి ఎందుకు అటువంటి ఉత్పత్తులు రావడం లేదో ఆలోచించాలి. మనం ఉద్యోగం చేయడం కాదు... ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి. విద్యార్థుల నుంచే కొత్త ఆవిష్కరణలు రావాలి. అందుకు విద్యార్థులను ప్రోత్సహించాలి. బాసర త్రిబుల్ ఐటీ లో ప్రతి సంవత్సరం ఇన్నోవేషన్ వారోత్సవాలు జరగాలి. '' అన్నారు కేటీఆర్

''విద్యార్థులు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. ఇప్పటి నుంచి మంచి నాణ్యమైన ఆహారం అందుతుంది. త్వరలోనే అందరికీ లాప్ ట్యాప్ లు అందిస్తాం. నేనూ హాస్టల్ ఉండి చదువుకున్న వాడినే నాకు హాస్టల్ లో ఉండే సమస్యలు తెలుసు మరో రెండు నెలల్లో ఇక్కడికి మళ్ళీ వస్తాను. ఇకపై రెగ్యులర్ గా ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా చూసే బాధ్యత నాది '' అన్నారు కేటీఆర్.

ఎన్ఐటీ, ఐఐటీలకు దీటుగా ఈ విద్యాసంస్థను తీర్చిదిద్దాలని కేటీఆర్ అన్నారు. అందుకే వెంకటరమణ వంటి మంచి అధికారిని వీసీగా తెచ్చాం. సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుంది అని కేటీఆర్ అన్నారు.

అదే విధంగా బాసర విద్యార్థులు సమ్మె చేసిన తీరును తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎక్కడా రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా, తమ సమస్యలపై తామే పోరాడిన విద్యార్థులను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ''మీరు అనుసరించిన విధానం నన్నెంతో ఆకట్టుకుంది'' అన్నారు కేటీఆర్.

సమస్యల పరిష్కారం కోసం పనికి మాలిన ప్రతిపక్షాలను పిలవకుండా విద్యార్థులే గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని పోరాడటం బాగుందన్నారు. మహాత్మాగాంధీ తరహాలో శాంతియుతంగా, వర్షం పడుతున్నా లెక్కచేయకుండా బయట కూర్చుని నిరసన తెలియజేయడం నాతో సహా చాలా మందికి నచ్చిందని తెలిపారు. తాను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఈ మాట చెబుతున్నానని అన్నారు.

First Published:  26 Sept 2022 4:50 PM IST
Next Story