బీఆర్ఎస్ ఏపీ బాధ్యతల్లో కేటీయార్, తలసాని బిజీ
కొత్తగా ఏర్పాటైన జాతీయపార్టీ బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలను కేసీయార్ మంత్రులు కేటీయార్, తలసాని శ్రీనివాసయాదవ్ కు అప్పగించినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
కొత్తగా ఏర్పాటైన జాతీయపార్టీ బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలను కేసీయార్ మంత్రులు కేటీయార్, తలసాని శ్రీనివాసయాదవ్ కు అప్పగించినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. వీళ్ళద్దరికి ఏపీతో మంచి సంబంధాలుండటమే కారణమట. తలసాని చాలా సంవత్సరాలు టీడీపీలో చాలా యాక్టివ్ గా పనిచేశారు. కాబట్టి టీడీపీలోని చాలామంది సీనియర్లతో మంచి సంబంధాలున్నాయి. కాబట్టి ఆ సంబంధాలను అడ్వాంటేజ్ తీసుకుని ఎంతమందిని వీలైతే అంతమందిని బీఆర్ఎస్ లోకి తీసుకువచ్చే బాధ్యతలను అప్పగించారట.
రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని చాలామంది సీనియర్ నేతలతో తలసాని టచ్ లోకి వెళ్ళినట్లు సమాచారం. సీనియర్లలో కూడా ప్రధానంగా తనసామాజికవర్గానికి చెందిననేతలతో తలసాని సంప్రదింపులు జరుపుతున్నారట. జనవరిలో ఏపీలో నిర్వహించాలని అనుకుంటున్న బహిరంగసభ ఏర్పాటు బాధ్యతలను కూడా తలసానికే కేసీయార్ అప్పగించారని పార్టీవర్గాలు చెప్పాయి. విజయవాడ-గుంటూరు మధ్య బహిరంగసభ నిర్వహించాలని కేసీయార్ ప్లాన్ చేస్తున్నారు.
బహిరంగసభ నిర్వహణ సమయానికి బీఆర్ఎస్ కు మద్దతిచ్చే ఏపీ నేతల విషయంలో క్లారిటి వచ్చే అవకాశముంది. ఈ దిశగానే తలసాని కూడా వర్క్ చేస్తున్నారు. ఇక కేటీయార్ అయితే ఉభయగోదావరి, కోస్తా జిల్లాలపైన ఎక్కువగా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందులో కూడా ఉభయగోదావరి, గుంటూరు జిల్లాలపైన ఎక్కువగా కాన్సంట్రేట్ చేశారట. ఎందుకంటే ఉభయగోదావరి జిల్లాల్లో ప్రధానంగా క్షత్రియ సామాజికవర్గం నేతలతో కేటీయార్ కు మంచి సంబంధాలున్నాయి. ఈ సంబంధాల కారణంగానే ముందు వాళ్ళకే గాలమేస్తున్నట్లున్నారు.
ఇక గుంటూరుజిల్లా అంటే ఇక్కడ కొందరితో కేటీయార్ కు వ్యాపార సంబంధాలున్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇప్పటికే తనకున్న పరిచయాలతో క్షత్రియ సామాజికవర్గంలోని ప్రముఖులతో కేటీయార్ చర్చలు మొదలుపెట్టేశారట. బహిరంగసభలోపు కొంతమంది ప్రముఖులను బీఆర్ఎస్ లోకి రప్పించే ప్రయత్నాల్లో కేటీయార్, తలసాని బిజీగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో బీఆర్ఎస్ కు మద్దతుగా పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్ధిగా అమలాపురం ఎంపీగా పోటీచేయబోతున్న అమ్మాజీ అని రాసున్న ఫ్లెక్సీలతో కలకలం మొదలైంది. మరి కేటీయార్, తలసాని తమ బాధ్యతల నిర్వహణలో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ఆసక్తిగా మారింది.