Telugu Global
Telangana

రాజకీయ కక్షలతో రైతులను ఆగం చేయొద్దు -కేటీఆర్

తెలంగాణలో నేడు ఎండిపోతున్న పొలాలు, మండుతున్న రైతుల గుండెలు కనపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

రాజకీయ కక్షలతో రైతులను ఆగం చేయొద్దు -కేటీఆర్
X

రాజకీయ కక్షతో రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం నుంచి నీళ్ల పంపింగ్ మొదలు పెట్టకుండా ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారని అన్నారాయన. కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద 10లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా కిందకు పోతున్నాయని, తక్షణం నీటి పంపింగ్ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ని బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో చెలగాటమాడుతోందన్నారు కేటీఆర్.


కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు బడ్జెట్ సమావేశాల అనంతరం కాళేశ్వరం బయలుదేరారు. ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా లోయర్ మానేర్ డ్యామ్ కి చేరుకున్నారు. ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టాలన్న సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని చెప్పారు కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవల్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం అని అన్నారు. కాళేశ్వరం సాయంతో పంజాబ్ ని తలదన్నేలా తెలంగాణ రాష్ట్రం ధాన్యం పండించిందని చెప్పారు. మేడిగడ్డలో ఒక పిల్లర్ లో చిన్న కుంగుబాటు ఉందన్న కారణంతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైనే తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఈ కుట్రల్ని కాంగ్రెస్ ఆపాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

అసెంబ్లీలో నిలదీస్తాం..

కాళేశ్వరం రిజర్వాయర్‌లో 240 టీఎంసీల మేర నీరు నిల్వ చేసుకోవచ్చని తెలిపారు కేటీఆర్. అంటే 24 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని, ఆ నీటినంతా ఈ ప్రభుత్వం వృథా చేస్తోందని మండిపడ్డారు. తమ హయాంలో రైతన్నలు సంతోషంగా ఉండేవారని, ఇప్పుడు ఎండిపోతున్న పొలాలు, మండుతున్న రైతుల గుండెలు కనపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారాయన. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు కేటీఆర్.

First Published:  25 July 2024 1:44 PM GMT
Next Story