ఇల్లు లేని పేదలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం.. డిసెంబర్ నుంచి మొదలు
తెలంగాణలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు మంత్రి కేటీఆర్. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతోపాటు, సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేసుకోలేనివారికోసం 3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
తెలంగాణలో గూడు లేని పేదలకోసం ఓవైపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తోంది. దీనికోసం ఒక్కో లబ్ధిదారుడికి 5.04లక్షలు ఆర్థిక సాయం చేస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఓవైపు జోరుగా సాగుతుండగా, మరోవైపు సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదల కోసం కూడా ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలులోకి తెస్తోంది. గతంలో ప్రకటించినట్టుగానే సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. డిసెంబర్ నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని చెప్పారు.
సంక్రాంతి నాటికి అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..
సంక్రాంతి నాటికి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ ఇళ్లు అందేలా చూడాలన్నారు. భారత్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు కేటీఆర్. కాంట్రాక్టర్లు ముందుకు రాని చోట అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని, సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు.
సొంత ఇల్లు లేదు అనే మాట వద్దు..
తెలంగాణలో ప్రతి పేదవాడికీ సొంత ఇల్లు ఉండాలనేదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు మంత్రి కేటీఆర్. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతోపాటు, సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేసుకోలేనివారికోసం 3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. నియోజకవర్గాలవారీగా దీనికోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, ఆ బాధ్యత స్థానిక శాసన సభ్యులకు అప్పగిస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మన ఊరు మనబడి కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణంలో అధికారులు చూపిన చొరవను మంత్రి ప్రశంసించారు. నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి కేటీఆర్.. గురుకులాల సంఖ్యను 200 నుంచి వెయ్యికి పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్, ఇంజినీరింగ్, వ్యవసాయ, నర్సింగ్ కాలేజీలు మంజూరయ్యాయని గుర్తు చేశారు.