Telugu Global
Telangana

కరెంటు బిల్లులు కట్టొద్దు.. సోనియా ఇంటికి పంపిద్దాం

సోనియా గాంధీ బిల్లు కడుతుందని రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు చెప్పారని, అందుకే కరెంటు బిల్లులను 10 జన్ పథ్ లోని సోనియా గాంధీ ఇంటికి పంపించాలన్నారు కేటీఆర్.

కరెంటు బిల్లులు కట్టొద్దు.. సోనియా ఇంటికి పంపిద్దాం
X

జనవరి నెల కరెంట్‌ బిల్లులు ఎవరూ కట్టొద్దని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ బిల్లులను ఢిల్లీలోని సోనియా గాంధీ ఇంటికి పంపిద్దామన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారాయన. గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దని, అలా చేస్తేనే కాంగ్రెస్ దిగొస్తుందని, వెంటనే ఆ హామీని అమలు చేస్తుందని అన్నారు కేటీఆర్.

సిబ్బంది అడిగితే..

కరెంటు బిల్లులు కట్టాలని విద్యుత్ సిబ్బంది అడిగితే ముఖ్యమంత్రి మాటలను వారికి వినిపించాలని చెప్పారు కేటీఆర్. సోనియా గాంధీ బిల్లు కడుతుందని రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు చెప్పారని, అందుకే కరెంటు బిల్లులను 10 జన్ పథ్ లోని సోనియా గాంధీ ఇంటికి పంపించాలన్నారు.

కర్నాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటు హామీ అమలుని ఆలస్యం చేయడంతో ప్రజలు ఆందోళనబాట పట్టారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చాక 100 రోజుల డెడ్ లైన్ పెట్టింది. ఈలోగా ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు. వాటిని స్క్రూటినీ చేసి, పథకాలు అమలయ్యే సరికి లోక్ సభ ఎన్నికలొస్తాయి. ఇలా కాలం జరపాలని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తామన్న హామీల విషయంలో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ హామీల అమలుకోసం ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజా పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

First Published:  20 Jan 2024 9:31 AM GMT
Next Story