మేం ఆస్తులు సృష్టించాం.. అప్పులు కాదు
మొన్నటివరకు ప్రధాని, అదానీ ఒకటేనని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేవారని, దావోస్ సాక్షిగా అదానీతో అలయ్ బలయ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్.
బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించిందని చెప్పారు కేటీఆర్. బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణను కాంగ్రెస్‌కు అప్పగించామన్నారాయన. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలన్నారు కేటీఆర్.
తెలంగాణ భవన్ లో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం
— BRS Party (@BRSparty) January 18, 2024
ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్… pic.twitter.com/rgp1XAT0CB
మొన్నటివరకు ప్రధాని, అదానీ ఒకటేనని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేవారని, దావోస్ సాక్షిగా అదానీతో అలయ్ బలయ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. బీజేపీ ఆదేశాల మేరకే అదానీతో రేవంత్ కలిసి పని చేస్తున్నారన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడం ఖాయమన్నారు కేటీఆర్. రూ.2లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, దశలవారీగా చేస్తామని ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారని, రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. ఎరువుల కోసం రైతులు మళ్లీ క్యూలైన్ లో నిలబడే పరిస్థితులు వచ్చాయన్నారు కేటీఆర్.
వరుసగా లోక్ సభ నియోజకవర్గాల వారీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపించాలని దూకుడుగా వెళ్తోంది. కాంగ్రెస్ ఇంకా అసెంబ్లీ గెలుపు ధీమాలో ఉండగా చాపకింద నీరులా బీఆర్ఎస్ తన పని చేసుకుంటూ పోతోంది. తాజాగా మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది. పార్టీ శ్రేణులు నిరంతరం యాక్టివ్ గా ఉండాలని, కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కేటీఆర్. ఆరు నెలల్లో కాంగ్రెస్ పై పూర్తి స్థాయి వ్యతిరేకత వస్తుందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.