Telugu Global
Telangana

అమరరాజా వ్యవహారం.. ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక

అమరరాజా కంపెనీ విస్తరణకోసం తెలంగాణను ఎంపిక చేసుకోవడం వెనక అప్పటి ప్రభుత్వ కృషి ఉందని తెలిపారు కేటీఆర్. అమరరాజా తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు.

అమరరాజా వ్యవహారం.. ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక
X

బ్రాండ్ తెలంగాణ అనే ఇమేజ్ ని దెబ్బతీయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజకీయ స్వలాభం కోసం తెలంగాణ బ్రాండ్ ని పణంగా పెట్టొద్దన్నారు. తెలంగాణ నుంచి అమరరాజా కంపెనీ తరలిపోతుందన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్ వేశారు. ఇప్పటికే కేన్స్ సెమికాన్ సంస్థ గుజరాత్ కి వెళ్లిపోయిందని, కార్నింగ్ ప్లాంట్ చెన్నైకి వెళ్లిపోయిందని, ఇప్పుడు అమరరాజా సంస్థ కూడా వెళ్లిపోతే అది పెద్ద విపత్తుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.


గతంలో తమకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకోకపోతే తాము విస్తరణ కోసం మరో ప్రాంతానికి వెళ్లిపోతామంటూ అమరరాజా సంస్థ చైర్మన్ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమరరాజా సంస్థతో ఒప్పందం జరిగింది. దాదాపు రూ.9500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా సంస్థ అంగీకరించింది. అయితే తెలంగాణలో ప్రభుత్వం మారాక ఆ సంస్థ విస్తరణ విషయంలో ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో గల్లా జయదేవ్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేట్టం ఇచ్చారు. హామీలను నిలబెట్టుకోలేకపోతే వేరే ప్రాంతానికి తమ కంపెనీని తరలిస్తామన్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అమరరాజా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు కేటీఆర్.

అమరరాజా కంపెనీ విస్తరణకోసం తెలంగాణను ఎంపిక చేసుకోవడం వెనక అప్పటి ప్రభుత్వ కృషి ఉందని తెలిపారు కేటీఆర్. రూ.9500కోట్ల పెట్టుబడులకోసం ఆ సంస్థను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పెట్టుబడిదారులందర్నీ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. అమరరాజా తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు కేటీఆర్.

తెలంగాణ అప్పుల కుప్పలా మారిందని, కేన్సర్ పేషెంట్ లా ఉందంటూ.. ఆమధ్య సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అలాంటి వ్యాఖ్యల వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్పారాయన.

First Published:  11 Aug 2024 4:54 AM GMT
Next Story