శ్రీశైలం లో విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాలి... తెలంగాణ, ఏపీలను ఆదేశించిన KRMB
జలాశయం వద్ద నీటిమట్టం అత్యంత వేగంగా తగ్గిపోతున్నదని, నీటిపారుదల, తాగునీటి అవసరాల కోసం కేటాయించిన నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని బోర్డు ఇటీవల రెండు ప్రభుత్వాలకు లేఖ రాసింది.
శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం వేగంగా తగ్గిపోతుండడంతో శ్రీశైలం డ్యాం వద్ద విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) కోరింది.
జలాశయం వద్ద నీటిమట్టం అత్యంత వేగంగా తగ్గిపోతున్నదని, నీటిపారుదల, తాగునీటి అవసరాల కోసం కేటాయించిన నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని బోర్డు ఇటీవల రెండు ప్రభుత్వాలకు లేఖ రాసింది.
బోర్డు ప్రకారం, శ్రీశైలం డ్యామ్‌కు కనీస నీటి మట్టం 805 అడుగులుగా నిర్ణయించబడింది, అయితే డ్యామ్ వద్ద ప్రస్తుత నీటి మట్టం 804.70 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి రిజర్వాయర్ మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) 885 అడుగులు కాగా స్థూల సామర్థ్యం 215.81 టీఎంసీలు.
అయితే, ప్రస్తుత స్థూల సామర్థ్యం 34.40 టీఎంసీలకు పడిపోయిందని, అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగునీరు, తాగునీటి అవసరాలకు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించడం సరికాదని లేఖలో పేర్కొన్నారు.
ఇన్‌ఫ్లో కూడా 235 క్యూసెక్కులకు తగ్గింది, గత ఏప్రిల్‌లో ఇదే సమయంలో 811.10 క్యూసెక్కుల నీరు ఉన్నదని, దానితో పోలిస్తే ఇది చాలా తక్కువని అధికారులు చెప్తున్నారు. శ్రీశైలం డ్యాం నుంచి రోజుకు విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ దాదాపు 0.5 నుంచి 0.6 టీఎంసీల నీటిని తీసుకుంటోందని సమాచారం.
విద్యుత్ కోసం కొత్త మార్గాలను అన్వేషించాలని KRMB రెండు రాష్ట్రాలను కోరింది. శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్‌లో ఆరు 150 మెగావాట్ల యూనిట్లు ఉన్నాయి, ఇందులో రోజుకు 900 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది, అయితే శ్రీశైలం రైట్ పవర్ హౌస్ వద్ద మొత్తం స్థాపిత సామర్థ్యం 770 మెగావాట్లు (ఏడు పవర్ జనరేటర్లు, ఒక్కొక్కటి 110 మెగావాట్ల సామర్థ్యంతో).
అయితే, తెలంగాణ నీటిపారుదల అధికారులు మాట్లాడుతూ, విద్యుత్ ఉత్పత్తి చేసిన నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి వదులుతున్నందున రాష్ట్రం నీటిని వృథా చేయడం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక (నీటిపారుదల) అధికారి శ్రీధర్ రావు దేశ్‌పాండే ప్రకారం, రాష్ట్రంలోని నీటి లభ్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర డిమాండ్లను తీర్చడానికి రిజర్వాయర్లలోనూ రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలోనూ సాగునీరు, తాగునీటి అవసరాలకు సరిపడా నీరు ఉందన్నారు.