కాంగ్రెస్‌లోకి సీతాదయాకర్ రెడ్డి.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ..!
హైదరాబాద్‌లో ముఖ్య నేతలతో సమావేశమై భవిష్యత్‌పై చర్చించారు. మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె మహబూబ్‌నగర్ జిల్లా పర్కాపూర్‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ముఖ్య నేతలతో సమావేశమై భవిష్యత్‌పై చర్చించారు. మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. సీతా దయాకర్ రెడ్డి మక్తల్ నుంచి టికెట్ ఆశిస్తున్నారని సమాచారం.
సీతా దయాకర్ రెడ్డి.. భర్త దయాకర్ రెడ్డికి తోడుగా రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో మహబూబ్‌నగర్ జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. డైనమిక్ లేడీగా పేరు తెచ్చుకున్న సీతా దయాకర్ రెడ్డి.. 2009లో దేవరకద్ర నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అదే ఎన్నికల్లో ఆమె భర్త కొత్తకోట దయాకర్ రెడ్డి మక్తల్ నుంచి గెలుపొందారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన తొలి దంపతులుగా రికార్డు సృష్టించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఇక కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులు సుదీర్ఘకాలంపాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే పార్టీలో కొనసాగారు. అయితే కాంగ్రెస్‌లో చేరే ఆలోచనతోనే 2022లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే టీడీపీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతలోనే కొత్తకోట దయాకర్ రెడ్డి క్యాన్సర్ బారిన పడి.. జూన్ 13న చనిపోయారు. తర్వాత సీతా దయాకర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు పార్టీలో చేరాలని కోరారు. అందుకు ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. సీతా దయాకర్ రెడ్డి చేరికతో మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరనుంది.
*