జగన్ కన్నీరు పెడితే రాత్రికి రాత్రే 25వేల మందిని తరలించా..
వైఎస్‌ఆర్ కోసం పదవులకు రాజీనామా చేసినందుకు తాము ఎన్నడూ బాధపడబోమని.. కానీ జగన్‌తో నడిచినందుకు మాత్రం బాధపడుతుంటామన్నారు. జగన్ కోసం తెలంగాణ ద్రోహులన్న ముద్ర వేయించుకున్నాం..
వైఎస్ మరణం తర్వాత ఆయన కుమారుడితో తొలుత నడిచిన వారిలో కొండా మురళి, కొండా సురేఖ ప్రముఖంగా కనిపించారు. ఆమె ఏకంగా మంత్రి పదవికి రాజీనామా చేసి మరీ జగన్‌తో నడిచారు. కానీ ఆ తర్వాత జగన్‌తో వారికి అసాధారణ గ్యాప్ వచ్చేసింది. కొండా సురేఖ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడడమే అప్పట్లో సంచలనం అయింది. ప్రస్తుతం వారు తెలంగాణకు, జగన్ ఏపీకి పరిమితం అయ్యారు. అయినా సరే జగన్ మీద కొండా దంపతులకు కోపం తగ్గినట్టు లేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో జగన్‌పై కొండా దంపతులు విరుచుకుపడ్డారు. జగన్‌ది వక్రబుద్ది అని విమర్శించారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పిలిచి కాంగ్రెస్‌లో ఉండండి రూ.5వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇప్పిస్తా, ఎమ్మెల్సీగా కొనసాగిస్తా, మంత్రి పదవి తిరిగి ఇప్పిస్తా అన్నారని అయినా సరే తాము జగన్‌తోనే వచ్చామన్నారు కొండా మురళి. తనకు సెక్యూరిటీ సమస్య ఉంది కాబట్టి పార్టీ తరపు ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందని కొండా మురళి జగన్‌ను కోరితే ''ఏ ఫ్యామిలీలోనైనా మూడు పదవులు ఇస్తారా..? ప్రభుత్వం రాగానే ఎలాగో మంత్రి అడుగుతారు.. అడగడంలోనూ హద్దుండాలి అంటూ ఒక లేఖను రాసి తమకు పంపించారు'' అని సురేఖ వివరించారు. ఆ లేఖ ఎప్పటికైనా పనికొస్తుందని దాచుకుందామంటే మా ఆయన ఆరోజే చించేశారు. తాము జగన్ కోసం త్యాగం చేసిన పదవులే కదా అవి అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ పదవిని పిల్లి సుభాష్ చంద్రబోస్ అడుగుతున్నారని చెప్పారని.. ఆయనకు ఇస్తే అభ్యంతరం లేదని చెప్పామని.. కానీ చివరకు ఆరు కోట్లు తీసుకుని మరో వ్యక్తికి ఇచ్చేశారని ఆమె ఆరోపించారు. జగన్‌ది వక్రబుద్ది అని, ఒకసారి ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తుంటే.. జనం రాలేదని తన ముందే జగన్ కన్నీరు పెట్టుకున్నారని కొండా మురళి వివరించారు. దాంతో బస్సులు పెట్టి రాత్రికి రాత్రే తెల్లవారేసరికి 25వేల మందిని అక్కడికి తరలించానని వివరించారు. జగన్ కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టానని ఆవేదన చెందారు.
ముఖ్యమంత్రి అయ్యాక కనీసం ఫోన్ చేసి పలకరిస్తారని భావించామని, అలా చేసి ఉంటే తాము చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవారని సురేఖ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబు వద్దకు వెళ్లి కొండా మురళిని ఎన్‌కౌంటర్ చేయాలని కాళ్లు పట్టుకున్నారని.. కానీ అందుకు చంద్రబాబు అంగీకరించలేదన్నారు. అదే అలాంటి పరిస్థితుల్లో జగన్ సీఎంగా ఉండి ఉంటే తనను ఎన్‌కౌంటర్ చేయించి ఉండేవారని కొండా మురళి వ్యాఖ్యానించారు.
ఇటీవల తాము ఒక సినిమాను నిర్మించామని.. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయవాడకు వెళ్తే.. వైఎస్ విగ్రహానికి పూలదండ వేసే కార్యక్రమానికి రావాల్సిందిగా మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఆహ్వానిస్తే.. వస్తామని చెప్పి రాలేదన్నారు. జగన్ ఆదేశాల వల్లే వారి వచ్చి ఉండకపోవచ్చన్నారు. కాంగ్రెస్ ఆదేశిస్తే పార్టీ తరపున తాము ఏపీలో ప్రచారం చేస్తామని, జగన్ వ్యక్తిత్వం ఎలాంటిదో అక్కడి ప్రజలకు వివరిస్తామని కొండా దంపతులు వెల్లడించారు.
వైఎస్‌ఆర్ కోసం పదవులకు రాజీనామా చేసినందుకు తాము ఎన్నడూ బాధపడబోమని.. కానీ జగన్‌తో నడిచినందుకు మాత్రం బాధపడుతుంటామన్నారు. జగన్ కోసం తెలంగాణ ద్రోహులన్న ముద్ర వేయించుకున్నాం.. మానుకోట రాళ్లదాడిలో చనిపోయే పరిస్థితి తెచ్చుకున్నామని ఆవేదన చెందారు. జగన్ నమ్మదగ్గ వ్యక్తి కాదన్నారు.