Telugu Global
Telangana

పార్టీ మారడంపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే తమ లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్‌ను ఓడించే పార్టీలోకే తాను చేరుతానని చెప్పారు. తాను ఏం చేయబోతున్నది త్వరలోనే ప్రకటిస్తాన‌న్నారు.

పార్టీ మారడంపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ మారడంపై రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం సుధీర్ఘంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాజగోపాల్ రెడ్డి చర్చలు జరిపారు. రాజగోపాల్ రెడ్డితో వ్యాపార సంబంధాలు కూడా ఉన్న జార్ఖండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఈ సమావేశం ఏర్పాటుకు మీడియేటర్‌గా వ్యవహరించారు.

కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలోకి వస్తే, మూడు నాలుగు నెలల్లోనే ఉప ఎన్నికలు జరిగేలా చూస్తామని... తిరిగి గెలిపించుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ ప్రవేశించకుండా... ఉప ఎన్నికల పేరుతో రాష్ట్రంలోనే కేసీఆర్ బిజీగా ఉండేలా చేయాలన్నది బీజేపీ ఎత్తుగడగా భావిస్తున్నారు.

అమిత్ షాతో భేటీ, పార్టీ మార్పుపై ప్రముఖంగా కథనాలు రావడంతో రాజగోపాల్ రెడ్డి స్పందించారు. రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు రాజగోపాల్ రెడ్డి నేడు కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆయనకు అస్వస్థత కారణంగా భేటీ వాయిదా పడింది. తనను కలిసిన‌ విలేకర్లతో ఆఫ్‌ ది రికార్డుగా మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. కేసీఆర్‌ను ఓడించే పార్టీలోకే తాను చేరుతానని కూడా చెప్పారు. తాను ఏం చేయబోతున్నది త్వరలోనే ప్రకటిస్తానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న రాజగోపాల్ రెడ్డి.. కేసీఆర్‌ను ఓడించే పార్టీలో చేరుతానని చెప్పడం ద్వారా పార్టీ మార్పు ఖాయమని పరోక్షంగా తేల్చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ తర్వాత ఉన్న పార్టీ బీజేపీనే కావడంతో ఆయన కాషాయంలో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  22 July 2022 1:02 PM IST
Next Story