Telugu Global
Telangana

అధిష్టానం వద్ద కోమటిరెడ్డి లాబీయింగ్.. పీసీసీ పదవులు తన వర్గానికి దక్కేటట్లు పావులు?

పీసీసీ కమిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అయినా లేదా కొత్తగా విస్తరించి అయినా తన వర్గీయులకు స్థానం కల్పించాలని కోమటిరెడ్డి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

అధిష్టానం వద్ద కోమటిరెడ్డి లాబీయింగ్.. పీసీసీ పదవులు తన వర్గానికి దక్కేటట్లు పావులు?
X

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పార్టీలోని ఇతర నేతలు, కార్యకర్తలు ఎన్ని ఆరోపణలు చేసినా సరే.. ఆయన మాత్రం తెర వెనుక తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. మునుగోడు ఉపఎన్నిక సమయం నుంచి కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరించిన కోమటిరెడ్డి.. కొన్ని రోజుల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇద్దరూ గాంధీ భవన్ వేదికగా తమ పాత విభేదాలు పక్కన పెట్టి మనసు విప్పి మాట్లాడుకున్నారు.

తెలంగాణకు కొత్త ఇంచార్జిగా నియమించిన మాణిక్ రావ్ ఠాక్రే తొలి సారిగా రావడంతో వారిద్దరి కలయిక సాధ్యం అయ్యింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తొలగిపోయాయని అందరూ భావించారు. నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన కోమటిరెడ్డి ఇకపై ఆయనతో కలిసి పని చేస్తారని అనుకున్నారు. కానీ, కోమటిరెడ్డి మాత్రం పాత విషయాలు మర్చిపోనట్లే కనపడుతున్నది. టీపీసీసీలో తన వర్గం వారే పదవుల్లో ఉండేలా ఏకంగా అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది.

మునుగోడు ఉపఎన్నిక ముగిసిన తర్వాత అధిష్టానం పీసీసీ కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, 23 మందితో ఎగ్జిక్యూటీవ్ కమిటీ, 84 మంది జనరల్ సెక్రటరీలు, 26 మంది జిల్లా అధ్యక్షులను నియమించింది. ఈ కమిటీల్లో తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారంటూ సీనియర్ నేతలు అసమ్మతి గళం వినిపించారు. దీంతో రేవంత్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే సీతక్క సహా ఇతరులు 13 మంది తమ పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు.

కాగా, అప్పట్లో రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి వర్గీయులు తిరిగి ఆ పదవులు తమకే కేటాయించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి మాణిక్ ఠాక్రే ఈ వారంలో హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నది. అప్పుడు ఆయనకు తమ వినతిని తెలియజేయాలని రాజీనామా చేసిన నాయకులు కోరాలని నిర్ణయించుకున్నారు. కానీ, అప్పట్లో ఏ కమిటీలోనూ చోటు దక్కించుకోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఈ పీసీసీ కమిటీల్లో తన వర్గీయులను నియమించేలా అధిష్టానం వద్ద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది.

పీసీసీ కమిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అయినా లేదా కొత్తగా విస్తరించి అయినా తన వర్గీయులకు స్థానం కల్పించాలని ఆయన గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఖాళీగా ఉన్న సికింద్రాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, జనగామ, సూర్యాపేట, భూపాలపల్లి, ఖమ్మం డీసీసీలను కూడా నియమించే ప్రయత్నం జరుగుతోంది. అందులో కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో ఉన్న తన సన్నిహితులతో ఈ మేరకు కోమటిరెడ్డి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీ చర్చ జరుగుతున్నది. మరి ఈ విషయంలో కోమటిరెడ్డికి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందా.. లేదంటే రాజీనామాలు క్యాన్సిల్ చేసి పాత వారితోనే సరిపెడుతుందా అనేది కొన్ని రోజుల్లో తెలియనున్నది.

First Published:  2 Feb 2023 10:22 AM IST
Next Story