నిన్న మోదీతో భేటీ.. ఈరోజు రాహుల్ కోసం ప్రాణమిస్తానని శపథం
రాహుల్ పై అనర్హత వేటు వేసి బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అవసరమైతే రాజీనామా చేస్తానని, ఇంకా అవసరమైతే ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు, అభిృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నిధులను అభ్యర్థించారు. మోదీ సానుకూలంగా స్పందించారని మెచ్చుకున్నారు. కట్ చేస్తే.. ఈరోజు రాహుల్ గాంధీ కోసం వెంకట్ రెడ్డి ప్రాణ త్యాగానికి సిద్ధం అంటున్నారు. రాహుల్ పై అనర్హత వేటు వేసి బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అవసరమైతే రాజీనామా చేస్తానని, ఇంకా అవసరమైతే ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
సహచర నాయకులు ఎన్ని యాత్రలు చేసినా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంటున్నారు. నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలబడుతున్నారు. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పటినుంచి వెంకట్ రెడ్డిపై కూడా కాంగ్రెస్ అనుమానంతోనే ఉంది. అప్పుడప్పుడు ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా ప్రవర్తిస్తుంటారు వెంకట్ రెడ్డి, కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి తనకంటే వీర విధేయుడు ఎవరూ లేరన్నట్టు ఆయన మాటలుంటాయి. తాజాగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు చేపట్టిన దీక్షలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అదానీ ఇష్యూని డైవర్ట్ చేయడానికే రాహుల్ పై అనర్హత వేటు వేశారని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి. అవసరమైతే ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన పరిస్థితి కంటతడి పెట్టేలా ఉందన్నారు. ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ వదులుకున్నారని, ఆయన అంత గొప్ప వ్యక్తి అని చెప్పారు. అదానీ గురించి రాహుల్ ఎప్పుడు మాట్లాడారో.. అప్పటి నుంచి ఆయనపై కుట్ర చేశారన్నారు. ఆగమేఘాల మీద పరువు నష్టం కేసులో శిక్ష పడేలా చేశారని ఆరోపించారు. రాహుల్ పై అనర్హత వేటు ఎత్తేసే వరకు పోరాటం ఉధృతం చేయాలన్నారు.