షోకాజ్‌కి వెంకట్ రెడ్డి సీల్డ్ కవర్ సమాధానం..
ఇప్పటికే వెంకట్ రెడ్డి షోకాజ్‌కి సమాధానం ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ నెల 1న సీల్డ్ కవర్‌లో వెంకట్ రెడ్డి పార్టీకి సమాధానం పంపించారట.
మునుగోడు పోలింగ్ పూర్తయింది, 6వ తేదీ ఫలితాలు వస్తాయి. సర్వేలతో ఫలితం ఎలా ఉంటుందో ఇప్పటికే అందరికీ ఓ అవగాహన వచ్చేసింది. రాజగోపాల్ రెడ్డి ఆల్రడీ ఆస్ట్రేలియాకు టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి వెంకట్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపైనే ఉంది. తప్పో ఒప్పో రాజగోపాల్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్క్ కోసం తన ఎమ్మెల్యే పదవి త్యాగం చేసేశారు. రాజకీయ భవిష్యత్తుని తనకు తానే అంధకారంలోకి నెట్టేసుకున్నారు. మరి ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి ఏంటి..? కాంగ్రెస్‌కి వీర విధేయుడిగా మిగిలిపోతారా..? లేక తాను కూడా తమ్ముడి బాటలోనే పయనిస్తారా..? తేలాల్సి ఉంది.
షోకాజ్ సంగతేంటి..?
కాంగ్రెస్ ఓడిపోతుంది, రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయండి అంటూ ఆమధ్య వెంకట్ రెడ్డి ఆడియో లీక్ కావడంతో కాంగ్రెస్ అధిష్టానం అక్టోబర్ 22న షోకాజ్ నోటీసు ఇచ్చింది. తాజాగా మరో షోకాజ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇంతలోనే వెంకట్ రెడ్డి నుంచి సమాచారం బయటకొచ్చింది. ఇప్పటికే వెంకట్ రెడ్డి షోకాజ్‌కి సమాధానం ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈనెల 1న సీల్డ్ కవర్‌లో వెంకట్ రెడ్డి పార్టీకి సమాధానం పంపించారట.
ఇంతకీ ఏం చెప్పారంటే..?
బీజేపీకి ఓటు వేయాలని తాను చెప్పినట్టు ఉన్న ఆడియో ఫేక్ అని షోకాజ్ నోటీసుకి సమాధానం ఇచ్చారట వెంకట్ రెడ్డి. ''ఆ వాయిస్ నాది కాదు, అది ఫేక్ ఆడియో.. మార్ఫింగ్ చేసి నా ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూశారు. పార్టీలో నేను చాలా సీనియర్ నేతను. ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేస్తున్నాను. నా సీనియార్టీకి పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు'' అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీల్డ్ కవర్‌లో సమాధానం పంపించినట్టు తెలుస్తోంది.