డీకే శివకుమార్‌తో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ.. వైఎస్ షర్మిల, రాజగోపాల్ చేరికపై కీలక చర్చలు?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలు, విలీనాలను అనధికారికంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దూకుడు పెంచారు. ఇతర పార్టీల నాయకుల చేరిక, క్షేత్ర స్థాయి కార్యకర్తలను సమాయత్తం చేయడంపై దృష్టి పెట్టారు. నిన్న, మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా క్రియాశీలంగా మారిపోయారు. వైఎస్ షర్మిల పార్టీ విలీనం, తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరగి పార్టీలో చేరడంపై వెంకట్ రెడ్డి ముందుండి వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలు, విలీనాలను అనధికారికంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాజాగా బెంగళూరులోని కుమారకృప గెస్ట్ హౌస్‌లో శివకుమార్‌తో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి చేరాలనుకుంటున్న విషయంతో పాటు.. వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశం కూడా చర్చకు వచ్చింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎల్బీనగర్ టికెట్ కేటాయిస్తే.. తప్పకుండా పార్టీలో చేరతారని శివకుమార్‌కు వెంకట్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దేవినేని సుధీర్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. ఎల్బీనగర్ నుంచి పలువురు కాంగ్రెస్ నాయకులు బరిలోకి దిగాలనే ఆసక్తితో ఉన్నారు. అయితే రాజగోపాల్‌కు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తాడని వెంకట్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.
మరోవైపు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశం కూడా చర్చకు వచ్చింది. కాగా, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల పార్టీ విలీనానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, తెలంగాణలో రాజకీయం చేయడానికే మీ నాయకులు ఒప్పుకోవడం లేదని కోమటిరెడ్డికి డీకే శివకుమార్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యలతో ఈ విషయం చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని.. రాజగోపాల్ గురించి హైకమాండ్ దృష్టికి తీసుకొని వెళ్తానని డీకే మాట ఇచ్చారు.
ఇటీవల ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధిష్టానం పెద్దలను కలిశారు. అప్పుడే డీకేను కలవాలంటూ ప్రియాంక గాంధీ సూచించినట్లు తెలుస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా ఆయనకు వివరించాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం కోమటిరెడ్డి.. డీకేను కలిసి అన్ని విషయాలు కూలంకషంగా వివరించారు. దివంగత వైఎస్ఆర్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. ఆ కుటుంబ పట్ల కూడా వెంకట్ రెడ్డి అభిమానం చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే షర్మిల వ్యవహారం కూడా డీకే శివకుమార్ దృష్టికి వెంకట్ రెడ్డి తీసుకెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ತೆಲಂಗಾಣದ ಭುವನಗಿರಿ ಸಂಸದರಾದ ಶ್ರೀ ಕೋಮಟಿ ರೆಡ್ಡಿ ವೆಂಕಟ ರೆಡ್ಡಿ ಅವರು ಇಂದು ಬೆಂಗಳೂರಿನ ಕುಮಾರಕೃಪಾ ಅತಿಥಿ ಗೃಹದಲ್ಲಿ ನನ್ನನ್ನು ಭೇಟಿ ಮಾಡಿ ಶುಭ ಹಾರೈಸಿದರು. ಈ ವೇಳೆ ಉಭಯ ರಾಜ್ಯಗಳ ಪ್ರಸ್ತುತ ರಾಜಕೀಯ ವಿದ್ಯಾಮಾನಗಳ ಕುರಿತು ಚರ್ಚಿಸಲಾಯಿತು. pic.twitter.com/C5bexLQcxi
— DK Shivakumar (@DKShivakumar) June 23, 2023